మోడీకే మీటర్​ పెట్టాలె

మోడీకే మీటర్​ పెట్టాలె
  • బీజేపీ లీడర్లు దోపిడీ దొంగలు
  • బూట్లు, చెప్పులు మోసే గులాములు: కేసీఆర్​
  • ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు సంక్షేమ ఫలాలు 
  • కేంద్రం రకరకాల పన్నులతోటి ప్రజల రక్తం పీలుస్తున్నది
  • సింగరేణిని  ప్రైవేట్​పరం చేస్తరట.. కార్మికులు కన్నెర్ర చేయాలె
  • 26 రాష్ట్రాల రైతులు నన్ను దేశం కోసం బయల్దేరుమన్నరు
  • మోటార్లకు మీటర్లు పెట్టుడు కాదు.. మోడీకే మీటర్​ పెట్టాలె
  • పెద్దపల్లి సభలో సీఎం.. టీఆర్​ఎస్​ఆఫీస్​​, కలెక్టరేట్​ ప్రారంభం

పెద్దపల్లి, వెలుగు: ఢిల్లీ నుంచి దోపిడీ దొంగలు వస్తున్నారని, వాళ్ల బూట్లు మోసే సన్నాసులు రాష్ట్రంలో ఉన్నారని బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్​ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్​ భారత్​ దిశగా పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రైతులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఇక్కడి రైతుల స్థితిగతులను చూసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుసంఘాల నేతలంతా తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని సీఎం తెలిపారు. ‘‘ఈ దేశాన్ని దోచే దోపిడీ దొంగలు.. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు ఇయ్యాల తెలంగాణలో కనవడ్తున్నరు. అరవయ్యేండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతోనే ఉందామా? మళ్లీ ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు, గజ దొంగలకు సద్ది కట్టి గులాములమవుదామా?”అని అన్నారు. 

ఇక్కడి బీజేపీ నేతలను ఢిల్లీ నేతలు గులాములను చేసుకొని.. బూట్లు, చెప్పులు మోపిచ్చుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ‘‘ఆ చెప్పులు మోసే వెదవలు కూడా ఎటుపడితే అటు కారుకూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్నరు” అని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్​ఎస్​ భవన్, ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ను సోమవారం కేసీఆర్​ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ‘‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలి.. రైతుల ప్రభుత్వం వస్తది. ఈ గోల్​మాల్​ ప్రధాని, ఈ గోల్​మాల్​ కేంద్ర ప్రభుత్వం చెప్పేది పచ్చి మోసం. రైతుల ఉసురుపోసుకుంటున్నరు. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నాకు ఒక మాట చెప్పిన్రు.. కేసీఆర్​ గారు మీరు దేశం కోసం బయల్దేరున్రి, మీకు స్వాగతం పలుకుతమని జేజేలు పలికిన్రు” అని ఆయన పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మోడీ సర్కార్​ మీటర్లు పెట్టాలంటున్నదని, మోడీకే మీటర్​ పెడుదామన్నారు. 

దేశంలో ఎక్కడాలేనంత అభివృద్ధి

తెలంగాణ  ఏర్పాటయ్యాక  దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్​ చెప్పారు. గుజరాత్​ మోడల్​ అని చెప్పి దేశంలో పాగా వేసిన బీజేపీ దొంగలు దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ఏ ఒక్క మంచి పని కూడా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్​లో జరగలేదని విమర్శించారు. ‘‘అక్కడ 24 గంటల కరెంట్​ రాదు.. రూ.2 వేల పింఛన్లు రావు.. పేదలకు ఆరోగ్య శ్రీ పథకం లేదు.. పేదలను దోపిడీ చేయడం తప్ప ఏదీలేదు” అని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరలు పెంచడంతో పాటు రకరకాల పన్నులు వేసి ప్రజల రక్తం పీలుస్తున్నదని ఫైర్​ అయ్యారు. మోడీ గో బ్యాక్​ అంటూ శ్రీలంకలో  ప్రజలు నినాదాలిచ్చారని ఆయన అన్నారు.  

నీళ్లు పారిద్దామా... రక్తం పారించుకుందామా?

‘‘మోసపోతే గోస పడ్తం. ఒకసారి దెబ్బతింటే వెనకకు పోతం. మీ బిడ్డగా నేను ఒక్కటే చెప్తున్న. కూలగొట్టడం అల్కటి పని. కట్టడమే కష్టం. ఈరోజు మనం బాగుపడే సమయంలో లక్షల కోట్లు కొల్లగొట్టే ఈ దుర్మార్గులు, ఈ గజదొంగలు వచ్చి ఏం జెప్తున్నరు? మతం పేరుమీద కొట్లాడుండ్రి అంటున్నరు. తెలంగాణ సాధించుకున్న తర్వాత  రాష్ట్రం సస్యశ్యామలం చేసుకునే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకున్నం. శ్రీరాంసాగర్​ లాంటి గొప్ప ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నయ్​. ఈ ప్రాజెక్టుల్లో నీళ్లు  పారించుకుందామా.. బీజేపీ లాంటి మతతత్వ పార్టీని బలపరిచి  రక్తం పారించుకుందామా?’’ అని సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు.  రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో చేపట్టిన పథకాలను చూసి 26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు, వారి  రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవని వాపోయారని ఆయన చెప్పారు. గత మూడు రోజులుగా ప్రగతిభవన్​లో రైతు సంఘాలతో చర్చలు జరిపామని, రైతు సంఘాల నాయకులంతా ఏకగ్రీవంగా తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారని కేసీఆర్​ అన్నారు. 

పెద్దపల్లి జిల్లాకు వరాలు

పెద్దపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్​ వరాలు కురిపించారు. జిల్లాలోని 266 గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున, మూడు మున్సిపాలిటీలకు, రామగుండం కార్పొరేషన్​కు  రూ. కోటి చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. వెంటనే నిధులు విడులయ్యేలా చూస్తానన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏర్పాటుకు డిమాండ్​ వచ్చిందని, పెద్దపల్లి నుంచి ఎలాంటి డిమాండ్​ లేకపోయినా జిల్లా ఏర్పాటు చేశామని తెలిపారు. 

సీఎం కేసీఆర్​ సభలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి బహిరంగ సభలో సీఎం కేసీఆర్​ మాట్లాడుతుండగా ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం చెలరేగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన పేరుమాండ్ల రమేశ్​.. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సీఎం కేసీఆర్​ సభకు వచ్చాడు. కేసీఆర్​ మాట్లాడుతుండగా.. రమేశ్​ తన వెంట బాటిల్​లో తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకున్నాడు. వెంటనే పోలీసులు.. రమేశ్​ చేతుల్లో నుంచి పెట్రోల్​ సీసా పడేసి, అతడ్ని బయటకు తీసుకెళ్లారు. రమేశ్​ వద్ద ఓ లెటర్​ను గుర్తించారు. ఆయన  తండ్రి మల్లయ్య జానపద కళాకారుడు.. ఇటీవలే చనిపోయాడు. తల్లి పక్షవాతంతో బాధపడుతున్నది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని, ఉన్నత చదువులు చదివినా తనకు ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో రమేశ్​ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.  

ప్రధానికి ఏమైనా తెలివితేటలు ఉన్నయా..? ధాన్యం కొనుమంటే ఆయనకు కొనుడు చేతగాదు.. ఏడపెట్టుకోవాలని మాట్లాడుతరు.. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్​లో బియ్యం, నూకలు, గోధుమలకు షార్టేజ్​ వస్తున్నది.. ఈ తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల  గోధుమలు, బియ్యం దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తున్నది.. ముందు చూపులేక, పరిపాలన చేతగాక పిచ్చిపిచ్చి విధానాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థను అట్టర్ ​ఫ్లాప్​ చేస్తున్నరు.
‑ సీఎం కేసీఆర్​