ఏపీలో బిజీబిజీగా సీఎం కేసీఆర్

ఏపీలో బిజీబిజీగా సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్….  అమరావతి టూర్లో బిజీగా ఉన్నారు. ఉదయం విజయవాడ వెళ్లిన కేసీఆర్… కొద్ది సేపటి క్రితం ఏపీ జగన్ నివాసానికి వెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు కేసీఆర్. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఏపీ సీఎంకు అందించారు కేసీఆర్. పార్టీ నేతలతో కలిసి తాడేపల్లి వెళ్లిన కేసీఆర్…. అక్కడే జగన్ తో కలిసి లంచ్ చేశారు.

అంతకు ముందు గన్నవరం నుండి రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్ వే హోటల్ కు చేరుకున్నారు సీఎం కేసీఆర్. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆహ్వాన పత్రికను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనం తర్వాత అమ్మవారి చిత్రపటంతో పాటు శేషవస్త్రంతో కేసీఆర్ ను దుర్గగుడి అధికారులు సత్కరించారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కేసీఆర్ కు  ఘనస్వాగతం పలికారు.

  సాయంత్రం  విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని దర్శించుకోనున్నారు కేసీఆర్. స్వామిజీ దగ్గర శిష్యరికం చేస్తున్న కిరణ్  బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగింత కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్  నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వెళ్లనున్నారు. సాయంత్రం కృష్ణాతీరంలో జరిగే సన్యాసాశ్రమ దీక్షల ముగింపు కార్యక్రమానికి కూడా గవర్నర్ తో పాటు రెండు  రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.