
- ప్రజలను నిరాశపర్చిన కేసీఆర్ టూర్
- జిల్లాకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే తిరుగుప్రయాణం..
మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్పర్యటనపై ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. జిల్లాకు ఎలాంటి ఎలాంటి వరాలు ప్రకటించకుండా సీఎం వెనుదిరిగారు. టూర్ అంతా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో సరిపోయింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో వచ్చిన కేసీఆర్ ముందుగా నస్పూర్‌లోని బీఆర్ఎస్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అనంతరం కొత్త కలెక్టరేట్‌ను ఓపెన్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల చిరకాల వాంఛ అయిన మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సౌకర్యార్థ్యం సర్కారు ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను నిర్మించామని చెప్పారు.
పరిపాలన సౌలభ్యం కోసం ఒకటి రెండు నియోజకవర్గాలు ఉన్న ములుగు, భూపాలపల్లి వంటి చోట్ల కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం కలెక్టరేట్‌వద్ద బీసీ వృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం, సొంత జాగలో ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి స్కీం కింద రూ.3లక్షల సాయంతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. చెన్నూర్నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,658 కోట్లలో చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర పామాయిల్ ఇండస్ర్టీ, రూ.164 కోట్లతో మంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మెడికల్ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. వికలాంగుల పింఛన్ రూ.వెయ్యి పెంచుతున్నామని ప్రకటించిన కేసీఆర్ప్రస్తుతం రూ.3,016 ఉన్న పింఛన్‌ను వచ్చే నెల నుంచి రూ.4,016 చెల్లిస్తామని అన్నారు.
సింగరేణి కార్మికులకు నిరాశ...
కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ప్రజలనుద్దేశించి 35 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్ధరణి పోర్టల్, సింగరేణి అభివృద్ధి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సాధించిన ప్రగతి గురించి వివరించారు. రైతుల భూముల రక్షణ కోసం మూడేండ్లు కష్టపడి ధరణి పోర్టల్ తీసుకొచ్చామన్నారు. దాని ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా అందుతున్నాయని, భూముల రిజిస్ర్టేషన్లను సులభతరం చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతం వేస్తామంటోందని, కానీ వాళ్లనే బంగాళాఖాతంలో కలుపాలని పిలుపునిచ్చారు. ధరణి పోతే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. అలాగే 134 ఏండ్ల చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్ పార్టీ ఆగం చేసిందని కేసీఆర్ విమర్శించారు. కేంద్రానికి అప్పు చెల్లించలేక 49 శాతం వాటాను అమ్మేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోల్‌మైన్స్‌ను ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
తమ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో సాధించిన ప్రగతి గురించి వివరించిన కేసీఆర్కార్మికులకు కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వకుండా పాత విషయాలనే ప్రస్తావించడంపై పెదవి విరుస్తున్నారు. ఈ సభలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బి.వెంకటేశ్ నేత, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్జడ్పీ చైర్ పర్సన్లు నల్లాల భాగ్యలక్ష్మి, రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్, కోనేరు కోనప్ప, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మలెయే గడ్డం అరవిందరెడ్డి, టీబీజీకేఎస్లీడర్లు ఐ.వెంకట్రావు, కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.