16న వికారాబాద్ లో కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలె

16న వికారాబాద్ లో కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలె

టీఆర్ఎస్ ను వీడనని, పార్టీ మారుతున్నట్లు తనపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ లోనే ఉంటూ.. వచ్చే ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని, గెలిచే వారికి కాకుండా ఓడించే వారికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. సర్వేలో ఎవరి పేరు ఉంటుందో వారికి అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ లోని కొందరు నేతలు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎవరు ఆపగలరని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో తాను సీనియర్ నేత అని చెప్పుకొచ్చారు.

ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ .. జిల్లాలో నూతన కలెక్టరేట్ తో పాటు టీఆర్ఎస్ భవన్ కూడా ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ భవన్ ను వికారాబాద్, పరిగి, తాండూరు, కోడంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నిన్న పరిశీలించగా... ఇవాళ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన వర్గీయులతో కలిసి పరిశీలించారు. ‘ఒకరి శాఖలో మరొకరు కలగజేసుకోవద్దు. ఎమ్మెల్యే పని ఎమ్మెల్యేనే చేయాలి. జెడ్పీ చైర్మన్ పని చైర్మన్ చేయాలే తప్ప వారి శాఖల్లో తలదూరిస్తే తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో జరుగుతున్న తంతే జరుగుతుంది’ అంటూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కామెంట్స్ చేశారు.