కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు: సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు: సీఎం కేసీఆర్‌

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి 100కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, పార్వతి మాతని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఆలయ అర్చకులతో మాట్లాడారు.

ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థాలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహోత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. యజ్ఞ యాగాదులకు గోదావరి తీరంలోని ఆలయ ప్రాంతం అణువుగా ఉంటుందని, ఆలయ పునర్నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతి తీర్థ స్వామిని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు.

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాజెక్ట్ ద్వారా 45లక్షల ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందివ్వనున్నట్లు సీఎం వివరించారు. ఉద్యమ కాలంలో రామగుండం దగ్గర గోదావరిని చూస్తే దుఖం వచ్చేదని, తెలంగాణకు తరలి రావాలని మొక్కుతూ గోదావరి నదిలో నాణాలు జారవిడిచే వాడినని, ఇప్పుడు తెలంగాణలో కష్టాలు తీరబోతున్నయని సీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులతో పాటు మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.