అంబేద్కర్​ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలన్నరు

అంబేద్కర్​ స్ఫూర్తితోనే కొత్త రాజ్యాంగం కావాలన్నరు
  • బీజేపీ నేతలపై ఎక్కడైనా దాడులు జరగొచ్చు
  • వెదవల్లెక్క ఇంట్లో పండి నోరు పారేసుకోవద్దు : కడియం

హైదరాబాద్‌‌, వెలుగు: అంబేద్కర్‌‌ స్ఫూర్తితోనే దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్​ సూచన చేశారని, ఇందులో తప్పేముందని టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతమే రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని పెంచాలంటే కొత్త రాజ్యాంగం అవసరం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై నిజామాబాద్‌‌లో జరిగినట్టే రేపు ఎక్కడైనా దాడి జరగొచ్చని, వెదవల్లెక్క ఇంట్లో పండి కేసీఆర్‌‌పై నోరుపారేసుకోవద్దని హెచ్చరించారు. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేసీఆర్​ పిలుపునిచ్చారని, అది తమ పార్టీ విధానమన్నారు. బుధవారం టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో ప్రభుత్వ విప్‌‌ బాల్క సుమన్‌‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌‌తో కలిసి కడియం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌‌ రాసిన రాజ్యాంగం తమకు ముమ్మాటికీ బైబిల్‌‌ లాంటిదేనని, అయినా ఆ రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించుకున్నామని, దానికి తాము కొత్త ప్రతిపాదనలు అందించామని చెప్పారు. దేశ అవసరాలు దృష్టిలో పెట్టుకొని కొత్త రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరం ఉందనే కేసీఆర్‌‌ అన్నారన్నారు. అసలు సిసలైన అంబేద్కర్‌‌ వారసులం తామేనని, బీజేపీ నేతలు గాడ్సే వారసులని దుయ్యబట్టారు. అంబేద్కర్‌‌ను బీజేపీ గౌరవించలేదన్నారు. సీఎం కేసీఆర్‌‌ ప్రకటనను బీజేపీ నేతలు వక్రీకరించి దళితులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశ జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 28% ఉంటే రూ.12 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌‌ పెట్టడానికి సిగ్గు ఉండాలన్నారు. ‘‘అరేయ్‌‌ మీకు ధైర్యం ఉందారా.. దేశంలో దళితబంధు అమలు చేస్తరా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘బీజేపీ నాయకులు గల్లీలో లీడర్లు, ఢిల్లీలో జీరోలు.. చేతగాని దద్దమ్మలు, సన్నాసులు” అని అన్నారు. ‘‘మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇవ్వలేనోళ్లను సన్నాసులని అనకుంటే ఏమంటరు. బండి సంజయ్‌‌వి బుడ్డర్‌‌ఖాన్‌‌, బట్టేబాజ్‌‌ మాటలు. బీజేపీ పాలనలో అన్ని రంగాలు దిగజారి పోయినయ్. విభజన చట్టంలోని హామీలు ఎందుకు బడ్జెట్‌‌లో పెట్టించలేదు. బీజేపీ దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నరు. ఆ పార్టీ నూటికి నూరు శాతం దళిత, రైతు, మైనార్టీ, మహిళా వ్యతిరేక పార్టీ” అని విమర్శించారు. సీఎం కేసీఆర్‌‌ను చూరచూర చేస్తామన్న బండి సంజయ్‌‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.