
ఏపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థ వంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై చర్చించారు.
‘‘నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాము. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాము. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాము. వృధాగా సముద్రం పాలు అవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాము. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
‘‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’’ అని సిఎం అన్నారు.
‘‘శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతున్నది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.