
బెంగుళూర్: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు యాజమాన్యమే కారణమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆర్సీబీ ఫ్రాంచైజీ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. తమ వాదనలు వినకుండానే ఏక పక్షంగా తీర్పు ఎలా ఇస్తారని క్యాట్ జడ్జిమెంట్‌ను పిటిషన్లో ప్రశ్నించింది. క్యాట్ తీర్పు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఆర్సీబీ పిటిషన్ 2025, జూలై 9న హైకోర్టులో విచారణకు రానున్నట్లు సమాచారం.
2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో బెంగుళూరు యాజమాన్యం 2025, జూన్ 4 విక్టరీ పరేడ్, చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలి రావాలని ఆర్సీబీ సోషల్ మీడియాలో కోరింది. దీంతో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు.
ALSO READ | Jan Shinwari: 41 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మరణం
ఈ క్రమంలోనే విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా.. మరో 50 మందికి పైగా అభిమానులు గాయపడ్డారు. తొక్కిసలాటకు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు బెంగుళూరు పోలీస్ కమిషనర్, అదనపు పోలీస్ కమిషనర్ (ACP) వికాష్ కుమార్‌తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ వికాష్ కుమార్ క్యాట్‌ను ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బెంగుళూర్ తొక్కిసలాటపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. చినస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీ యాజమాన్యమేనని.. దీనికి వాళ్లే బాధ్యత వహించాలంది. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా మూడు నుంచి ఐదు లక్షల మందిని సమీకరించడానికి ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిందని.. ఈ ప్రకటనల వల్లే అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారంది.
చివరి నిమిషంలో విక్టరీ పరేడ్, సన్మాన కార్యక్రమం నిర్వహించడాన్ని క్యాట్ తప్పుబట్టింది. కేవలం 12 గంటల తక్కువ సమయంలో పోలీసులు అన్ని ఏర్పాట్లను చేస్తారని ఆశించలేమని.. పోలీసులు కూడా మనుషులే.. వాళ్లేమి దేవుళ్లు లేదా ఇంద్రజాలికులు కాదని పోలీసులను సమర్ధించింది. ఈ నేపథ్యంలో క్యాట్ వ్యాఖ్యలను ఆర్సీబీ కర్నాటక హైకోర్టులో సవాల్ చేసింది.