
భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతిలో మగ్గిపోతున్నారు. మధ్యతరగతి ప్రజలు తమ కంటే పై స్థాయిలో జీవిస్తున్న వారిని అందుకోవటానికి చేసే ప్రయత్నం వారిని ఆర్థికంగా కుదేలు చేస్తోంది. ఈ క్రమంలో వారి ఆర్థిక అలవాట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. పరువు కోసం పాకులాడే మధ్యతరగతి ప్రజలు తమకు వస్తున్న ఆదాయాన్ని అవసరాలకు సరిపెట్టడం అదే సమయంలో ఇతర కోరికలు, లగ్జరీలకు అప్పుల మీద అప్పులు చేయటం చూస్తూనే ఉన్నాం.
దేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నులు, ద్రవ్యోల్బణం వంటి వాటి కంటే పెద్ద ఈఎంఐల భారంతో బాధపడుతున్నారని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈఎంఐ ట్రాప్ భారతీయులను ఆర్థికంగా కుదేలు చేస్తోందని వెల్త్ అడ్వైజర్ తపస్ చక్రబొర్తి హెచ్చరించారు. మధ్యతరగతి ప్రజలు.. సంపాదించటం→ అప్పులు చేయటం→ అప్పులు తిరిగి చెల్లించటం→ ఇదే మళ్లీ మళ్లీ చేయటం→ ఎలాంటి సేవింగ్స్ లేకపోవటం→ క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ తమకు తెలియకుండానే మధ్యతరగతి భారతీయులు అప్పుల చట్రంలో చిక్కుకుంటున్నారు.
ఫోన్ కొనాలన్నా ఈఎంఐ, ఫ్రిజ్డ్ కావాలన్నా ఈఎంఐ, ఏసీ.. సోఫా.. సినిమా టిక్కెట్లు, విమాన ప్రయాణాలకూ ఈఎంఐ వాడేస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. కనీసం కిరాణా సరుకులు కొనాలన్నా.. క్రెడిట్ కార్డలు గీకేస్తున్నారు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా రుణం రావటంతో చాలా మంది లోన్ తీసుకోవటాన్ని ప్రజలు సర్వసాధారణమైన అంశంగా ఫీల్ అవుతున్నారు. కానీ పరిస్థితులు వాస్తవం కంటే దారుణంగా దిగజారుతున్నాయి.
ALSO READ : పిల్లలపై ప్రేమతో దివాళా తీస్తున్న రిటైర్డ్ పేరెంట్స్ : ATMలా వాడేస్తున్న కొడుకులు, కూతుళ్లు!
భారతదేశంలో ప్రజల గృహ రుణం జీడీపీలో 42 శాతానికి చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై వచ్చే రుణాలు, బైనౌ పే లేటర్, పే లేటర్ సర్వీసులు పరిస్థితులను మరింతగా దిగజారుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఉన్న 70 శాతం ఐఫోన్లు ఈఎంఐలపై కొన్నవే అనే విషయం చూస్తుంటేనే పరిస్థితి అర్థమౌతుంది. చిన్న రుణాలు తీసుకుంటున్న వారిలో 11 శాతం తిరిగి వాటిని చెల్లించటంలో విఫలం అవుతున్నారని తేలింది.
ఈ పరిస్థితుల్లో ఒక్కో లేయర్ రుణాలను పేర్చుకుంటూ మధ్యతరగతి భారతీయులు కోలుకోలేని రుణాల ఊబిలోకి జారుకుంటున్నారని చక్రబొర్తి చెప్పారు. క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ అంటూ నెలకి కనీసం రూ.25వేల వరకు వచ్చిన ఆదాయాన్ని చెల్లింపులకు వాడుతున్నారు ప్రజలు. దీంతో ఎలాంటి సేవింగ్స్ లేక ఉత్తి చేతులతో మిగులుతున్నారని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా అనారోగ్యం ఏర్పడితే ఇక అంతే జీవితం మెుత్తం తలకిందులైపోతుందని హెచ్చరించారు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదని.. మధ్యతరగతి ప్రజలు చేస్తున్న పనులు దేశాభివృద్ధిని కూడా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వస్తున్న ఆదాయంలో ఈఎంఐలు 40 శాతం కంటే తక్కువగా ఉండేలా మధ్యతరగతి భారతీయులు జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే కనీసం అత్యవసరాలకు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటుకు నెలకు రూ.500 వెచ్చించాలన్నారు. అందరి ముందూ గొప్పగా.. ఉన్నతంగా జీవిస్తున్నట్లు కనిపించటం కోసం రుణాలు తీసుకుని విసాలాలకు పోవద్దని చక్రబొర్తి మరీమరీ హెచ్చరించారు. వీలైనంత త్వరగా డబ్బును సేవ్ చేయటం, సరైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం వంటి అలవాట్లను నేర్చుకోవాలన్నారు.
ఒత్తిడితో జీవితాన్ని గడపటం సాధారణమైన అంశం కాదని.. రుణాలను చెల్లించకుండా జీవించటం సక్సెస్ కాదన్నారు. మంచి జీవితం కోసం చేసే పరుగులో అప్పుల ఊబిలో పడొద్దన్నారు. ఎక్కువ సంపాదించటం కంటే ఎక్కువ దాచుకోవటంలోనే ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుందని మధ్యతరగతి ప్రజలు గుర్తుంచుకోవాలి.