
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తిరుమల వెళ్తున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరతారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకన్నను దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్ వస్తారు.
వీలును బట్టి జగన్ ప్రమాణానికి..
కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలకు ఆమోదం కోసం జూన్ తొలి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం యోచిస్తున్నట్టు తెలిసింది.చట్టాలకు మంత్రిమండలి ఆమోదం కోసం ఈనెల 28న కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశముందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అధికారులు మాత్రం భేటీని ధ్రువీకరించలేదు. ఈనెల 30న రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయన్నట్టు తెలిసింది. సాయంత్రం ఉంటే తొలుత ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరై ఢిల్లీ వెళ్లే అవకాశముంది. మధ్యాహ్నమే ఉంటే 29న సాయంత్రమే కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని సమాచారం. ఏపీ సీఎం ప్రమాణ స్వీకారానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు మంత్రులు హాజరవనున్నట్టు తెలిసింది.
ఇక పాలనపై నజర్…
గతేడాది సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. తొలుత అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలొచ్చాయి. తర్వాత 20 రోజుల గ్యాప్ వచ్చింది. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. రేపటితో కోడ్ ముగుస్తుండటంతో కేసీఆర్ ఇక పాలనపై నజర్ పెడతారని తెలుస్తోంది. జూన్ 2న ఆవిర్భావ వేడుకల తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఆసరా పెన్షన్ల పెంపు, రైతుబంధు పెంపు జూన్‌లోనే అమలు చేయనున్నారు. రెవెన్యూ, మున్సిపల్ చట్టాలకు ఆమోదం కోసం తొలి వారంలో రెండు, మూడ్రోజులు అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించనున్నారు. తర్వాత కేబినెట్ విస్తరణ చేసి పూర్తిస్థాయి పాలనపై సీఎం దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.