తెలంగాణలో వంద స్థానాల్లో కేసీఆర్‌ ప్రచారం చేస్తారు : కేటీఆర్‌

తెలంగాణలో వంద స్థానాల్లో కేసీఆర్‌ ప్రచారం చేస్తారు  : కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.  తాను జీహెచ్‌ఎంసీ, సిరిసిల్లతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానని వెల్లడించారు. మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు.  ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని భావిస్తున్నామన్న కేటీఆర్.. అధికారుల బదిలీలను సాధారణ బదిలీలుగానే చూస్తామని అన్నారు.

 తమకు గతంలో మాదిరిగానే 88 సీట్లు రావచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు.  హుజూరాబాద్‌లో కూడా తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.  ఈటల రాజేందర్‌ గజ్వేల్‌లోనే కాదు.. మరో 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇక వైఎస్ షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా, రాహుల్‌ గాంధీ, మోదీ ఇక్కడికొచ్చి పోటీ చేసినా  బీఆర్ఎస్ విజయం ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. 

మరోవైపు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన  పీసీసీ మాజీ చీఫ్  పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో  చేరుతానంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరుతారని చెప్పారు.  కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నుకుంటారని ఆరోపించారు.