యాదాద్రి ప్రారంభానికి  సీఎం వస్తరు

యాదాద్రి ప్రారంభానికి  సీఎం వస్తరు

చినజీయర్ గురించి తెలియదు: ఈవో గీతారెడ్డి
ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలే 
28 నుంచి ఆలయంలోకి మీడియాకు అనుమతి ఉండదని వెల్లడి

యాదగిరిగుట్ట, వెలుగు: ‘‘యాదాద్రి ఆలయ ప్రారంభానికి సీఎం కేసీఆర్ వస్తారు. చినజీయర్ స్వామి రాక గురించి నాకు తెలియదు. ఆయన పెట్టిన ముహూర్తానికే ఆలయ ప్రధానార్చకుల పర్యవేక్షణలో ఉద్ఘాటన కార్యక్రమం జరుగుతుంది. ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు ఇవ్వలేదు. అందరూ ఆహ్వానితులే’’ అని యాదాద్రి ఈవో గీతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఈవో క్యాంప్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ పూజలు జరుగుతాయని చెప్పారు. 21న బాలాలయంలో పంచకుండాత్మక సుదర్శన యాగం ప్రారంభమవుతుందని తెలిపారు. 28న ఉదయం 11:55 గంటలకు మహా కుంభ సంప్రోక్షణతో ఆలయ ఉద్ఘాటన చేస్తామన్నారు. ఆ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. సుదర్శన యాగం కోసం బాలాలయంలో యజ్ఞకుండాల ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. 28న సంప్రోక్షణ పూజలు పూర్తయిన తర్వాతే స్వామి వారి దర్శనం కోసం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు.

మీడియాపై ఆంక్షలు... 
28న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాకు అనుమతి ఉండదని, ఏస్ మీడియా ద్వారా లైవ్ కవరేజీ ఇస్తామని ఈవో గీతారెడ్డి చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 28 నుంచి ప్రధానాలయంలోకి మీడియాకు పర్మనెంట్ గా అనుమతి ఉండదని తెలిపారు. టెంపుల్ కు సంబంధించిన ఏ విషయమైనా ప్రత్యేకంగా నియమించే పీఆర్వో ద్వారా సమాచారం అందిస్తామన్నారు. వీవీఐపీలు వచ్చిన సమయంలోనూ మీడియాకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.