
- కొందరు పనిలేనివాళ్లు ఫేజ్- 1 టైమ్‌లో కేసులు వేశారు
- ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో అట్లా జరగొద్దనే డీపీఆర్ ఇస్తలేం
- మీడియాతో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌కు ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామో చెప్తే కోర్టుకు వెళ్లి కేసులు వేస్తారని, అందుకే ప్రాంతాల పేర్లు చెప్పడం లేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిగా ఈ కారిడార్‌ను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ‘‘మాకు గతంలో డీపీఆర్ షేర్ చేస్తే.. కొంతమంది పనిగట్టుకొని కోర్టులకు వెళ్లారు. ఫేజ్ వన్‌లో మేం ఎన్నో కష్టాలు పడ్డం. మెట్రో ఫేజ్ వన్ లో డీఎంఆర్‌సీ కొన్ని తప్పులు చేసింది. చిన్న క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ అయింది. డీపీఆర్ లో పూర్తి వివరాలు ఉండవు. కానీ దాన్ని పట్టుకుని ఒక పెద్ద మనిషి హైకోర్టులో కేసు వేసి ఆరునెలలు పనులు ఆపించారు. అందుకే మేం ఇప్పుడు డీటెయిల్స్ షేర్ చేయడం లేదు” అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్ ప్రాజెక్ట్ కు శుక్రవారం మైండ్ స్పేస్ (రాయదుర్గం) జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ పునాదిరాయి వేయనున్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గురువారం రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్ లో ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో కేవలం ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్సే కాకుండా నగర శివారుల్లో ఉండే వాళ్లు కూడా సిటీకి వచ్చేందుకు ఈ కొత్త ప్రాజెక్ట్( మెట్రో సెకండ్ ఫేజ్) ఉపయోగపడుతుందని అన్నారు. దీనిపై జనరల్ కన్సల్టెంట్ తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో 300 కోర్టు కేసులను గెలిచి, మూడువేల ఎకరాల భూ సేకరణ జరిగిందని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఎయిర్ పోర్ట్ మెట్రోను పూర్తి చేస్తామన్నారు.
అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని..
ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా రాయదుర్గం నుంచి 0.9 కిలో మీటర్ల ముందుకు తీసుకుపోతున్నామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. బయో డైవర్సిటీ రెండు ఫ్లై ఓవర్ల పైనుంచి థర్డ్ లెవల్ లో మెట్రో లైన్ వెళ్తుందని తెలిపారు. ఆ తర్వాత ఓరియన్ విల్లా, రోడా మిస్ట్రీ మధ్య నుంచి, ఖాజాగుడా దగ్గర కుడి వైపు తీసుకుని నానక్ రామ్ గూడ కాడ ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్తుందని వివరించారు. ఓఆర్‌ఆర్ పక్కనుంచి నార్సింగి, రాజేంద్రనగర్ దాటి శంషాబాద్‌కు మెట్రో రూట్ ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని స్టేషన్ల లొకేషన్లను ఫిక్స్ చేస్తామని తెలిపారు. స్కైవాకర్స్ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మెట్రో 27.5 కిలో మీటర్లు ఎలివేటెడ్ కారిడార్‌లో, ఒక కిలో మీటర్ రోడ్ లెవల్‌లో, 2.5 కిలో మీటర్లు అండర్ గ్రౌండ్ లో ఉంటుందని పేర్కొన్నారు. సిటీ మెట్రో 80 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని, ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ 120 కిలో మీటర్ల స్పీడ్ లో వెళ్తుందని చెప్పారు. 31 కిలో మీటర్ల మెట్రోతో 26 నిమిషాల్లో శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవచ్చని వివరించారు. ఆరు కోచ్ లకు ప్లాట్ ఫామ్ లను డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. ట్రైన్ డోర్ ఓపెన్ అయినప్పుడు ప్లాట్ ఫామ్ స్క్రీన్ డోర్లు తెరుచుకునే కొత్త టెక్నాలజీ తీసుకువస్తున్నామన్నారు.