
కరీంనగర్, వెలుగు: హుజురాబాద్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్(సీఎంఆర్ఎఫ్) చెక్కులకు అటాచ్అయి ఉండే సీఎం లెటర్ లబ్ధిదారులకు చేరడం లేదు. కేవలం చెక్కులను మాత్రమే పంపిణీ చేస్తున్నఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. చెక్కుల కింద సీఎం సందేశంతో కూడిన లెటర్ ను లబ్ధిదారులకు అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే ఈ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను సకాలంలో పంపిణీ చేయకుండ నిర్లక్ష్యం చేయడంతో వాటి గడువుతీరిపోతున్నది. ఇలా 2024 సెప్టెంబర్ నుంచి 2 జనవరి వరకు జారీ అయిన వందలాది చెక్కులకు గడువు తీరిపోవడంతో జూన్ 19న రీవాలిడేషన్ డేట్ వేయించి ఇటీవల పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కనీస మర్యాద పాటించట్లేదు:ప్రణవ్
సెక్రటేరియెట్ నుంచి వచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కు కింద సీఎం రేవంత్ రెడ్డి ఫొటో, తెలంగాణ ప్రభుత్వ లోగో, లెటర్ నంబర్ తోపాటు మంజూరు చేసిన మొత్తం, చెక్కు నంబర్, తేదీని తెలియజేస్తూ లబ్ధిదారుడిని సంబోధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాసిన లెటర్ ఉంటుంది. అయితే లబ్ధిదారులకు ఇవ్వకముందే ఆ లెటర్ల వరకు చించేసి కేవలం చెక్కులనే ఎమ్మెల్యే పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయాలకతీతంగా సీఎంఆర్ఎఫ్ బాధితులకు మంజూరవుతుందని, అలాంటప్పుడు సీఎం లెటర్ ను తీసి చెక్కులు పంపిణీ చేయాల్సిన అవసరమేంటని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ ప్రశ్నించారు. నిత్యం ప్రొటోకాల్ గురించి మాట్లాడే ఎమ్మెల్యే తాను మాత్రం కనీస మర్యాద పాటించడం లేదని విమర్శించారు.