మంత్రి వర్గం నుంచి పార్థా ఛటర్జీకి ఉద్వాసన

మంత్రి వర్గం నుంచి పార్థా ఛటర్జీకి ఉద్వాసన

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన మంత్రి పార్థా ఛటర్జీపై వేటుపడింది. సీఎం మమతా బెనర్జీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు.  ఈడీ అరెస్ట్ నేపథ్యంలో పార్థా ఛటర్జీకి మినిస్టర్ పోస్ట్ నుంచి ఉద్వాసన పలికారు. పార్థా ఛటర్జీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో..ఆయన్ను పదవి నుంచి తప్పించాలని బెంగాల్ వ్యాప్తంగా డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో  ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన దీదీ.. పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బెంగాల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అటు పార్థా ఛటర్జీ మమతా  ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం పార్థాను మంత్రి పదవి నుంచి తప్పించడంతో అతని శాఖను మమతా బెనర్జీయే చూసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సెక్రటరీ జనరల్‌గా కూడా ఉన్నారు. ఈ పదవి నుంచి కూడా పార్థను తప్పించారు. 

పార్థా ఛటర్జీ సన్నిహితురాలు సినీ నటి అర్పిత ఇంట్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఇప్పటికే ఆమె ఇంట్లో రూ. 29 కోట్లు పట్టుబడగా..తాజాగా రెండో ఫ్లాట్ లో మరో రూ. 21 కోట్లు దొరికాయి.  ఈ సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా కనిపించడం సంచలనంగా మారింది.

 కేజీల కొద్దీ బంగారం, విలువైన డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో మొత్తం రూ. 50 కోట్లకుపైగా నగదును ఈడీ సీజ్‌ చేయడం గమనార్హం. సోదాల్లో  దొరికిన డబ్బును అధికారులు పెద్ద పెద్ద బాక్సుల్లో తరలించారు.

ఆ డబ్బంతా పార్థ ఛటర్జీదే : అర్పిత ముఖర్జీ  

దొరికిపోయిన ఆ డబ్బంతా పార్థ ఛటర్జీదేనని ఈడీ అధికారులకు అర్పిత ముఖర్జీ  వాంగ్మూలం ఇచ్చింది. నగదును దాచుకునేందుకు పార్థా ఛటర్జీ తన ఫ్లాట్ ను వాడుకునే వారని ఆమె అధికారులకు తెలియజేసింది.  ఈ కేసులో వీరిద్దరితో పాటు.. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్యను కూడా ఈడీ విచారిస్తోంది. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో జులై 23న  అరెస్ట్ అయిన పార్థ ఛటర్జీ, సినీనటి అర్పిత ముఖర్జీ  ఆగస్టు 3 వరకు రిమాండ్లో ఉండనున్నారు.