
- గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు..
- స్కూళ్ల బస్సులు కూడా అటే..
- ప్రతిపక్ష పార్టీల లీడర్లు, వీఆర్ఏల ముందస్తు అరెస్టు
కామారెడ్డి/భైంసా : సీఎం కేసీఆర్ సభ కోసం నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని దాదాపు అన్ని ఆర్టీసీ బస్సులను అధికారులు మళ్లించారు. దీంతో ప్రయాణికులు బస్టాండ్లలోనే గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. హాస్పిటళ్లకు వెళ్లే రోగులు, ఊర్లకు వెళ్లే మహిళలు, వృద్ధులు, పిల్లలు తిప్పలు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించగా.. వాళ్లు ఎక్కువ చార్జీలు వసూలు చేశారు. నిజామాబాద్‌లో సోమవారం కేసీఆర్ సభ జరిగింది. దీనికోసం నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి దాదాపు 80 నుంచి 90% బస్సులను తరలించారు. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో 134 బస్సులకుగాను 90 వరకు, బాన్స్వాడ డిపోలో 100 బస్సులకు గాను 70 బస్సులను అటే మళ్లించారు. భైంసా నుంచి 75 బస్సులకు గాను 55, నిర్మల్ నుంచి144 బస్సులకు గాను 80, ఆదిలాబాద్ నుంచి 135 బస్సులకు గాను 55 బస్సులు తీసుకెళ్లారు. ఆయా డిపోల పరిధిలోని ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడ్తారు. దీంతో రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నిజామాబాద్‌తో పాటు పలు రూట్లలో బస్సుల రాకపోకలతో బస్టాండ్లు రద్దీగా ఉంటాయి. కానీ సోమవారం బస్సులు లేక వెలవెలపోయాయి. నిజామాబాద్, ఆర్మూర్, హైదరాబాద్, కరీంనగర్ రూట్లతో పాటు ఎల్లారెడ్డి, నిజాంసాగర్, బాన్స్వాడ, గుండారం, దోమకొండ, బీబీపేట, రామారెడ్డి, రామయంపేట రూట్లలో బస్సులు లేక జనం తిప్పలు పడ్డారు. నిర్మల్‌జిల్లా భైంసా బస్టాండ్‌లో సోమవారం ఉదయం ఆఫీసర్లు బస్సులు రద్దయినట్లు నోటీసు అంటించారు. ‘‘కేసీఆర్ నిజామాబాద్ ప్రోగ్రామ్ ఉన్నందు వల్ల బస్సులను రద్దు చేయడం జరిగినది’’ అంటూ ఓ తెల్లపేపర్ మీద రాసిపెట్టారు. కామారెడ్డి డిపోలో ఆదివారం రాత్రే ‘‘సీఎం ప్రోగ్రామ్ నిజామాబాద్‌లో ఉన్నందున అన్ని రూట్లలో బస్సులు రద్దు చేయడినవి. ప్రయాణికులు సహకరించగలరు’’ అని రాసి ఉంచారు.
టీచర్స్‌డే నాడు స్కూళ్లకు వెళ్లలేకపోయిన స్టూడెంట్లు..
పెద్దపల్లి జిల్లాలో ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా స్కూళ్లను బంద్ చేయడం వివాదాస్పదకావడంతో సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్కూళ్లకు అధికారికంగా సెలవు ప్రకటించ లేదు. కానీ, విద్యాసంస్థల బస్సులను సీఎం మీటింగ్‌కు తరలించడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విద్యార్థులు ఇండ్ల వద్దే ఉండిపోయారు. టీచర్స్ డే నాడు స్కూళ్లకు వెళ్లలేకపోయారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 680 ప్రైవేట్ బడుల్లో 826 బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు సుమారు 100 బస్సులు ఉండగా.. వీటిలో సగానికి పైగా సీఎం సభకు పంపారు.కామారెడ్డి జిల్లా నుంచి మరో 100కు పైగా స్కూల్ బస్సులు సీఎం సభకు వెళ్లాయి.
చాలా ఇబ్బంది పడ్డం
దగ్గికి వెళ్దామని కామారెడ్డి బస్టాండు వచ్చిన. ఎంత సేపు చూసినా బస్సు రాలేదు. ఎంక్వైరీ దగ్గరికి పోయి అడిగితే బస్సులు సీఎం సభకు పంపినమని చెప్పిన్రు. దీంతో చాలా ఇబ్బందులు పడ్డం.
- సాయిబాబు, ప్రయాణికుడు
గంటకు పైగా ఎదురుచూసిన
ఎల్లారెడ్డిపేట నుంచి నిజామాబాద్ వెళ్లేందుకు కామారెడ్డికి వచ్చిన. బస్టాండ్‌లో నిజామాబాద్ బస్సు కోసం గంటకుపైగా వెయిట్ చేసినా రాలేదు. చాలా మంది నాలాగే ఎదురు చూస్తూ కనిపించిన్రు. - మల్లేశ్, ప్రయాణికుడు