భట్టి మైక్ కట్.. ఫిరాయింపులపై సీఎం హాట్ కామెంట్

భట్టి మైక్ కట్.. ఫిరాయింపులపై సీఎం హాట్ కామెంట్

ఫిరాయింపులపై అసెంబ్లీ గరంగరం

ఎమ్మెల్యే భట్టి అభ్యంతరం

దేశమంతటా కాంగ్రెస్ కు ఆకర్ష తగ్గుతోందని కేసీఆర్ కామెంట్

మీ నాయకుడు బాగుంటే వాళ్లెందుకు బయటకు వెళ్తారు

సీఎం కేసీఆర్ సీరియస్

మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ విలీనంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని అన్నారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు. సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవుతున్నారంటూ… ఎమ్మెల్యే రాజాసింగ్ కు అవకాశం ఇచ్చారు. ఐతే… భట్టి మధ్యలో నినాదాలు చేస్తూ.. తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించారనీ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు.

సీఎం కేసీఆర్ స్పందించి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై మాట్లాడారు. తెలంగాణ రోల్ మోడల్ గానే ఉంటుందని.. అందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే వ్యవహారం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నాయకులే సమాధాన పర్చుకోవాలని అన్నారు.

“రాజ్యాంగ నిబంధనలకు లోబడి.. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వచ్చారు.  మేం కొన్ని విషయాలు అసెంబ్లీ ద్వారా అందరికీ చెప్పదల్చుకున్నా. బయట కూడా జరుగుతున్న కొన్ని ప్రచారాలకు ఇదే మా సమాధానం. మేం అధికారంలోకి వచ్చినప్పుడే కొందరు వస్తామని చెప్పారు. ఐతే.. మేం చేర్చుకోలేదు. ఐతే.. ఓ పార్టీ నుంచి భారీగా వస్తుంటే వద్దని ఎలా అంటాం. ఏపీలో 2/3 మంది టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే.. స్పీకర్ మెర్జ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. గోవాలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. దేశమంతటా కాంగ్రెస్ ది అదే పరిస్థితి. కాంగ్రెస్ కు ఆకర్షణ తగ్గి వాళ్లు వెళ్లిపోతున్నారు. మీకు మీరే వాళ్లను కంట్రోల్ చేసుకోవాలి తప్ప.. ఇతరుల మీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదు. మీరు నాయకులైతే మిమ్మల్ని ఎందుకు వీడిపోతారు.  ఏదో రాజ్యాంగ వ్యతిరేకం, నేరం జరిగినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు.దేశంలో ఎక్కడైనా సరే ఏ పార్టీలో అయినా మూడింట రెండు వంతుల మంది స్ప్లిట్ అయి వస్తే.. జాయిన్ చేసుకోరా.. విలీనం చేసుకోరా.. అందుకే స్పీకర్ బులెటిన్ జారీచేశారు. ఇందులే వింతేముంది” అన్నారు సీఎం.

చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు చెప్పారు.