కామారెడ్డి చేరుకున్న సీఎం రేవంత్.. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

కామారెడ్డి చేరుకున్న సీఎం రేవంత్..  వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి గురువారం (సెప్టెంబర్ 04) కామారెడ్డి చేరుకున్నారు. ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ వరదలకు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు. పంటనష్టం, ఆస్తినష్టం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

గురువారం మధ్యాహ్నం ప్రత్యేక హెలీకాప్టర్ లో కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారు సీఎం. సీఎంతో పాటు మంత్రులు  సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకున్నారు. అక్కణ్నుంచి ప్రత్యేక బస్సు (ప్రజా సంక్షేమ రథం)లో వరద ప్రభావిత ప్రాంతాలకు బయలుదేరారు. 

లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బి బ్రిడ్జ్ ను పరిశీలించారు సీఎం. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. పూర్తిస్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.