
- హైకోర్టు విచారణ నేపథ్యంలో మంత్రులతో కీలక సమావేశం
- అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చ
హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో జీవో 9పై విచారణ సందర్భంగా వినిపించాల్సిన వాదనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్‌రెడ్డి విస్తృతంగా చర్చించారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు బీసీ మంత్రులతో సమాలోచనలు జరిపారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాల్సిందిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని సీఎం కోరారు. ఈ సమావేశం నుంచే ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేలా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, కోర్టు అడిగినవన్నీ ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఉండటంతో ప్రభుత్వ యంత్రాగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పరిస్థితి అంచనా వేస్తూ ముందుకు..
హైకోర్టులో జీవో 9పై విచారణ నేపథ్యంలో ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్ అభిషేక్మనుసింఘ్వీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం సోమవారం కలిసింది. బుధవారం హైకోర్టు విచారణకు హాజరై.. వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు అభిషేక్ మను సింఘ్వీ ప్రభుత్వం తరఫున జీవో 9ను సమర్థిస్తూ కీలక వాదనలు వినిపించనున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డీ(6), ఆర్టికల్ 243 టీ(6) నిబంధనలు స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు కల్పిస్తున్నాయని, ఆ ప్రకారమే జీవో 9 ఇచ్చామని ప్రభుత్వం తరఫున లాయర్లు వాదించనున్నారు.
అలాగే, 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో.. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% సీలింగ్‌ను దాటిందని, ఈ విధంగా సుప్రీంకోర్టు రూలింగ్ అమల్లో లేదని కోర్టుకు వివరించనున్నారు. కాగా, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గంట గంటకూ పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్నది.