తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్

తెలంగాణను  అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్
  • పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేలా సహకరించండి
  • అమెరికాలోని తెలుగువాళ్లకు సీఎం రేవంత్​రెడ్డి పిలుపు
  • న్యూయార్క్​లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
  • పదిరోజులు అమెరికా, సౌత్​ కొరియాలో పర్యటన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని, ఇందు కోసం ఎన్నారైలు కలిసి రావాలని, సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన అమెరికా,  దక్షిణ కొరియా పర్యటన చేపట్టారు. శనివారం హైదరాబాద్​ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్.. మొత్తం 10 రోజుల పాటు ఆయా దేశా ల్లోని ప్రధాన నగరాల్లో  పర్యటించనున్నారు. 

ఆదివారం న్యూయార్క్​లోని జేఎఫ్ కే ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడి తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్​ నగరాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేయాలన్న కలనే మనందర్ని కలిపింది” అని అన్నారు. తన ఈ టూర్​ను కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే ప్రారంభించడం గౌరవప్రదంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఏపీకి చెందిన ఎన్నారై సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతతో తమ బృందానికి స్వాగతం పలకడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణ అభివృద్ధి కోసం తెలుగువారైన ఎన్నారైలు తమ వంతు సహకారాన్ని అందించాలి. రాష్ట్రానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చేలా సహకరించాలి” అని కోరారు.

పర్యటనలో సీఎం రేవంత్  తోపాటు సీఎస్ శాంతికుమారి, ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, పలువురు సీఎంవో ఆఫీసర్లు ఉన్నారు. పర్యటనలో భాగంగా అమెరికా, సౌత్​ కొరియాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల చైర్మన్లు,  ఎండీలు, సీఈవోలతో సీఎం రేవంత్ టీమ్​ సమావేశం కానుంది. న్యూజెర్సీ నుంచి సీఎం అధికారిక కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొత్తం 10 రోజుల పర్యటన ఈ నెల 13న ముగియనుంది. 14న ఆయన తిరిగి హైదరాబాద్​కు చేరుకోనున్నారు.  

అమెరికాకు బయల్దేరిన మంత్రి శ్రీధర్ బాబు

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్​లో పాల్గొనేందుకు మరో బృందం ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఇందులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. సోమవారం ఈ టీమ్​ సీఎం రేవంత్ బృందంతో కలిసి పలు ప్రముఖ కంపెనీల సమావేశాల్లో పాల్గొననుంది.