మీది రావుల టీం.. మాది దళిత, గిరిజన బిడ్డల టీం: సీఎం రేవంత్‌‌‌‌

మీది రావుల టీం.. మాది దళిత, గిరిజన బిడ్డల టీం: సీఎం రేవంత్‌‌‌‌
  • దళితులంటే కేసీఆర్‌‌‌‌కు చిన్నచూపు.. 
  • స్పీకర్‌‌‌‌ను ఓర్వలేకనే పోడియం వద్ద బీఆర్ఎస్​ ఆందోళన: సీఎం రేవంత్‌‌‌‌
  • భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌‌‌ను అవమానిస్తున్నారు.. ఇది దొరల అహంకారం
  • బ్లాక్ మెయిల్ కోసమే మీ హౌస్ కమిటీలు.. ఆ పప్పులు మా దగ్గర ఉడకవు
  • హరీశ్‌‌‌‌రావు తమ్ముడి భూ దందాలపై హౌస్ కమిటీకి సిద్ధమా ? 
  • సీఐడీపై నమ్మకం లేకపోతే... సీబీఐ విచారణకైనా రెడీ
  • మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు
  • జీతం తీసుకొని అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్​ రిజైన్‌‌‌‌ చేయాలి 
  • కాళేశ్వరం కేసు అప్పగిస్తే 48 గంటల్ల జైల్లో వేస్తమన్నరు.. బీజేపీ-.. బీఆర్ఎస్ ఒక్కటే 
  • ఇప్పడు ఆ ఫైల్​ను ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఎందుకు తొక్కిపెట్టారు? 
  • కేసీఆర్‌‌‌‌తో కడియం శ్రీహరి సమానమైన నేత.. ఆయన నిజాయతీని శంకించలేరు
  • పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి తీరును కేటీఆర్, హరీశ్‌‌‌‌రావు సమర్థిస్తారా ?
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అలా అవమానిస్తే ఒప్పుకుంటారా ? అని ప్రశ్న

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావులాంటి ‘రావు’ల టీమ్ అని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం భట్టి విక్రమార్క, సీతక్కలాంటి దళిత, గిరిజన బిడ్డల టీమ్ అని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో హౌస్ కమిటీలను కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసమే వేశారని, అలాంటి పప్పులు తమ దగ్గర ఉడకవని అన్నారు. 

హౌస్ కమిటీ అడుగుతున్నారని.. హరీశ్‌‌‌‌రావు తమ్ముడి భూ దందాలపై హౌస్ కమిటీకి సిద్ధమా? అని ప్రశ్నించారు. ఆదివారం శాసన సభలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఖనిజ సంపద దోపిడీపై 2014 జూన్‌‌‌‌ 2 నుంచి ఇప్పటి వరకు జరిగిన వ్యవహారాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని, ఒకవేళ ఆ విచారణపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు.

అలాగే, ఇసుక దోపిడీని అరికట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాజీనామా చేయాలని అడగటం సరికాదని అన్నారు. మీ తాతలు దిగొచ్చినా ఆయన రాజీనామా చేయరని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటిదాకా కోటి రూపాయల జీతం తీసుకొని  సభకు రాకుండా ఇంట్లో ఉంటున్నారని, ముందు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  దళితులంటే  కేసీఆర్‌‌‌‌కు చిన్నచూపు అని, సభలో ఒక దళితుడు స్పీకర్‌‌‌‌గా ఉండటం ఓర్వలేకే ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్ద గొడవలు చేస్తున్నారని, అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు. 


సీనియర్ నేత కడియం శ్రీహరి నిజాయితీని ఎవరూ శంకించలేరని, ఆయన కేసీఆర్‌తో సమానమైన నేత అని పేర్కొన్నారు. శ్రీహరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. కాళేశ్వరం కేసును అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో వేస్తామని చెప్పి ఇప్పుడు కాళేశ్వరం ఫైళ్లను ఢిల్లీలో తొక్కిపెట్టడం ద్వారా బీజేపీ-.. బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించారన్నారు. 

భవిష్యత్తులో ఏ సభ్యుడూ ఇలా ప్రవర్తించకుండా చర్యలు
కడియం శ్రీహరి పట్ల పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని సీఎం రేవంత్​ రెడ్డి స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి ఎంతో అనుభవం ఉన్న నాయకుడని,  ఆయన మీద ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని కొనియాడారు. అలాంటి సీనియర్‌‌ను అసభ్యంగా దూషించడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. కౌశిక్‌రెడ్డి ప్రవర్తనను హరీశ్‌రావు, కేటీఆర్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. 

కేసీఆర్​ను అవమానిస్తే ఒప్పుకుంటురా ? అని బీఆర్‌‌ఎస్‌ నేతలను అడిగారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని, రూల్ నంబర్ 288 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఏ సభ్యుడూ ఇలా ప్రవర్తించకుండా ఒక దిక్సూచిలా ఉండేలా చర్యలు ఉండాలని చెప్పారు. సభలో అల్లరి చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులను బడ్జెట్ సమావేశాల మొత్తం నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అప్పుడు పదవులన్నీ ‘రావు’ల దగ్గరే..  
కాంగ్రెస్ పార్టీ పునాదులు 140 ఏండ్ల నాటివని, ఈ దేశ మూల పురుషులైన దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు న్యాయం చేయడానికే ఈ పార్టీ పుట్టిందని రేవంత్‌ పేర్కొన్నారు. చట్టసభల్లో ధన ప్రభావం, కుల ప్రభావం వల్ల దళితులు ఎన్నిక కాకపోవచ్చని గుర్తించి రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని తెలిపారు.  కాంగ్రెస్‌కు జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే లాంటి దళితుడిని నియమించామని, అది తమ పార్టీ విధానమని చెప్పారు.

తెలంగాణలో కూడా ప్రజాపాలన వచ్చాక దళితులకు, గిరిజనులకు అధికారం కట్టబెట్టామని, కానీ దళితుడిని సీఎంను చేస్తానని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. దళితులకు పాలన చేతకాదని అవమానించారని మండిపడ్డారు. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క లాంటివారు తమ టీమ్‌లో ఉన్నారని, ఇది దళిత, గిరిజన బిడ్డల టీమ్ అని చెప్పారు.

గతంలో కేసీఆర్ కేబినెట్‌లో కేవలం ఒకే దళితుడికి అవకాశం ఇచ్చారని, డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక దళిత బిడ్డను బర్తరఫ్ చేశారని గుర్తుచేశారు. తాము భట్టి విక్రమార్కలాంటి సమర్థుడిని డిప్యూటీ సీఎంను చేసి ఆర్థిక శాఖను అప్పగించామని చెప్పారు. మున్సిపల్ శాఖ కేటీఆర్ వద్ద, సీఎం పదవి కేసీఆర్ వద్ద ఉండేవని తెలిపారు. తమ టీమ్‌లో అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, రామచంద్ర నాయక్, వేముల వీరేశంలాంటి అణగారిన వర్గాల ప్రతినిధులు ఉన్నారని వెల్లడించారు.

కానీ బీఆర్ఎస్​లో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీశ్‌రావు, రామారావు, కవితారావు, సంతోష్ రావులాంటి వారికే ప్రాధాన్యత దక్కిందని చెప్పారు. పదవులు కూడా వినోద్ రావు, సంతోష్ రావు వంటి వారికే ఇచ్చారన్నారు. తమది సామాజిక వర్గాల కలయిక అని, మీది ఒకే కుటుంబం పర్యవేక్షణలో ఉండే టీమ్ అని సభలో పేర్కొన్నారు.

దళితులపై ఉన్న వివక్ష బయటపెడ్తున్నరు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అవమానించేలా ప్రతిపక్షం ప్రవర్తిస్తున్నదని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. భట్టి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారని, జ్ఞానంలో ఎవరికైనా పరీక్ష పెడితే ఆయనే మొదటి స్థానంలో నిలుస్తారని చెప్పారు. అట్లాంటి దళిత బిడ్డను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసినప్పుడు కూడా కేసీఆర్ ఓర్వలేకపోయారని, 19 మంది ఎమ్మెల్యేలను తగ్గించి ఆయన హోదాను గుంజుకున్నారని తెలిపారు. 

ఇవాళ ఆయన ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెడుతుంటే అవగాహన లేదని, చేతకాదని విమర్శించడం దొరల అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘‘దొరలు మాత్రమే బడ్జెట్ పెట్టగలరు, దొరలు మాత్రమే పాలన చేయగలరు’’ అనే భ్రమలో ప్రతిపక్ష నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. దళితుల పట్ల మీకున్న వివక్ష భట్టి విక్రమార్కవిషయంలో మరోసారి బయటపడిందని బీఆర్‌‌ఎస్‌ నేతలనుద్దేశించి రేవంత్ అన్నారు.

సభలో స్పీకర్‌‌గా దళితుడు ఉండటాన్ని ప్రతిపక్షం సహించలేకపోతున్నదన్నారు.  ఒక దళితుడు స్పీకర్‌‌గా సభను నడపలేడనే సందేశాన్ని బయటకు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే గంటల కొద్దీ పోడియం వద్ద కూర్చొని సభను స్తంభింపజేస్తున్నారు. దళితుడు పైన కూర్చుంటే దొర బిడ్డలైన తాము కింద కూర్చోవాలా అనే అహంకారంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుకు స్పీకర్  ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా విజ్ఞత ప్రదర్శించలేదని, పోడియం వద్ద కూర్చొని సభను అవమానించారని ఫైర్​ అయ్యారు. దళితుల పట్ల కేసీఆర్ పార్టీకి ఉన్న కక్ష, వివక్ష సభలో స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. దళితుడు స్పీకర్‌‌గా ఉన్నంత కాలం సభను నడవనివ్వకూడదు అనే ఉద్దేశం వారి ప్రవర్తనలో కనిపిస్తున్నదన్నారు. 

భూదందాలు సక్రమం చేసుకోవడానికి బ్లాక్​మెయిల్​
మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్ మండలంలో జరిగిన భూ దందాల గురించి సీఎం రేవంత్‌ వివరాలు వెల్లడించారు. హరీశ్‌రావు తమ్ముడు మహేశ్వర్ రావు, ఆయన మామ హనుమంతరావు, బావమరిది సుమన్ రావు ఒక ప్రైవేట్ కంపెనీని బెదిరించి వందల ఎకరాల భూమిని ధరణి ద్వారా బదలాయించుకున్నారని ఆరోపించారు. సేల్ డీడ్లు లేకుండా, కంపెనీ కొనుగోలు చేయకుండానే వందల ఎకరాల భూమి బదిలీ అయిందని చెప్పారు. ఈ అక్రమ బదలాయింపుపై కలెక్టర్ రిపోర్ట్ అడిగారని, దీంతో మంత్రి పొంగులేటి హరీశ్‌ కలిసి సహకరించాలని కోరారని వెల్లడించారు. 

‘‘నా తమ్ముడు, మామ ఇరుక్కున్నారు.. నాకు ఇంట్లో బువ్వ పెట్టే పరిస్థితి లేదు’ అని హరీశ్‌రావు బతిమిలాడారన్నారు.  కానీ మంత్రి అది కుదరదని, సీఎం నివేదిక కోరారని చెప్పడంతో అప్పటి నుంచి  మంత్రిని హరీశ్‌ టార్గెట్ చేశారన్నారు. భూ దందాలపై హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నానని, హరీశ్‌, కేటీఆర్, వెంకట్రామిరెడ్డి దీనికి ఒప్పుకోవాలని సవాల్ విసిరారు.  తెలంగాణ పోలీసులు, సీఐడీ మీద నమ్మకం లేకపోతే కిషన్‌రెడ్డిని అడిగి సీబీఐ విచారణకైనా కోరాలని సూచించారు. బాలానగర్‌‌లో జరిగిన భూ దోపిడీపై హౌస్ కమిటీ వేయడమే తన నిర్ణయమని, హరీశ్‌ రావు బంధువుల అక్రమాలపై నిగ్గు తేలుస్తామని తేల్చి చెప్పారు.

 పొంగులేటిని ఏకాకిని చేయలనుకుంటే కుదరదు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్​పై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు. ఆయన నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారు” అని అన్నారు. 

ఇసుక దోపిడీని అరికట్టి ఆదాయాన్ని పెంచినందుకే ఆయనపై కక్ష గట్టారని వ్యాఖ్యానించారు.  కేసీఆర్ కోటి రూపాయల జీతం తీసుకుంటూ సభకు రాకుండా ఇంట్లో ఉంటున్నారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని ఏకాకిని చేసి రాజకీయం చేయాలని చూస్తే అది సాధ్యం కాదని రేవంత్ స్పష్టం చేశారు. 

విచారణ అనగానే ఒకరిపై ఒకరు పడి ఏడుస్తున్నరు
 సీఐడీ విచారణకు ఆదేశించిన వెంటనే హరీశ్‌రావు, కేటీఆర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని సీఎం రేవంత్‌ అన్నారు. రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇవాళ అధిపతులుగా మారారని, విచారణ అనగానే భయపడుతున్నారని అన్నారు. విచారణకు ఆదేశించగానే ఒకరిపై ఒకరు పడి ఏడుస్తున్నారని, బయటకు వెళ్లి తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఖనిజ సంపద అక్రమాలపై తమ ప్రభుత్వం  సీఐడీ విచారణకు ఆదేశించిందని, 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అన్ని లావాదేవీలపై ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు. ఏ సమాచారం ఉన్నా ప్రతిపక్ష సభ్యులు సీఐడీ అధికారుల వద్ద అందజేయవచ్చని, వారు ఇచ్చే ఫిర్యాదులకు రశీదు కూడా ఇస్తారని వెల్లడించారు.  

‘కాళేశ్వరం’పై ఎందుకు చర్యలు తీసుకుంటలేరు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలపై కూడా రేవంత్‌ మండిపడ్డారు. ‘‘కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రధాని మోదీ, అమిత్ షా ఇక్కడికి వచ్చి చెప్పారు. కిషన్‌రెడ్డి  అయితే ‘కేసును సీబీఐకి ఇవ్వండి.. 48 గంటల్లో కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతాం’ అని ప్రగల్భాలు పలికారు. తాము సీబీఐ విచారణకు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక్కటై కేసులను తొక్కిపెడుతున్నా రన్నారు. గత ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకు న్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, పాయల్ శంకర్‌కు చెబుతున్నా.. ‘‘ముందు మీ నాయకుడు కిషన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి సీబీఐ విచారణ చేయాలని కోరండి.. ఆ తర్వాత మాకు సూచనలివ్వండి” అని అన్నారు.

నాటి 3 హౌస్‌‌‌‌ కమిటీలను ఫిరాయింపులకు వాడుకున్నరు: సీఎం రేవంత్​ రెడ్డి
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వక్ఫ్ ప్రాపర్టీలు,  ప్రభుత్వ భూముల ఆక్రమణ, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల అక్రమాలపై మూడు హౌస్ కమిటీలు వేసింది. వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు, ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా రాజకీయ పార్టీ ఫిరాయింపులకు వాడుకున్నారు.

ఇప్పుడు కూడా హౌస్ కమిటీ వేసి మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. మంత్రి మీద బురద జల్లి వారి హయాంలో రెవెన్యూ శాఖలో జరిగిన దోపిడీని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. మైనింగ్​ శాఖను ఒక దళితుడు సమర్థవంతంగా నిర్వహించలేరని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దళిత మంత్రిని అవమానించడమే లక్ష్యంగా సభలో ప్రవర్తించారు. ఇంగ్లిష్‌‌‌‌ మీడియంలో చదువుకున్న ఆ మంత్రి ఆంగ్లం నుంచి తెలుగులో చెప్పేలోపు ఎదురుదాడి చేశారు.-