
ముషీరాబాద్, మేడిపల్లి, వెలుగు: టీఎస్పీఎస్సీ ఇన్నాళ్లు నిరుద్యోగులను మోసం చేసిందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ విమర్శించారు. టీఎస్పీఎస్సీలో జరిగిన తప్పులను, పేపర్ లీకేజీ చేసిన వారిని వెనకేసుకొచ్చిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిదని ఆరోపించారు. మంగళవారం చిక్క డపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆయన స్టూడెంట్లు, నిరుద్యోగులతో కలిసి సీఎం రేవంత్ ఫొటోకు పాలాభిషేకం చేశారు.
తర్వాత ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తానన్న మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియామకాలు పారదర్శకంగా చేపడతారని తెలిపారు. నిరుద్యోగులకు స్టూడెంట్లకు ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీపై రివ్యూ చేసిన సీఎం.. సంస్థ చైర్మన్జనార్దన్రెడ్డిని వివరణ ఇవ్వాలని ఆదేశించగా భయంతో రాజభవన్ వెళ్లి రాజీనామా అందజేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిరుద్యోగులు భారీగా పాల్గొన్నారు.
పేపర్ లీకేజీపై ఎంక్వైరీ చేయాలి: ఏఐఎస్ఎఫ్
గ్రూప్స్ పరీక్షల పేపర్లు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం మేడి పల్లిలోఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీపై దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిందన్నారు. కొత్త ప్రభుత్వం పేపర్ లీకేజీలపై విచారణ వేగవంతం చేసి, కారకులు, వారి వెనక ఎవరున్నారో బయటపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల ద్వారా రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యుల రాజీనామాలు ఆమోదించకుండా వారిపై ఎంక్వైరీ జరపాలన్నారు.