ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని ఈ భేటీ సందర్భంగా సింధియాకు విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమే టీ – ఫైబర్ లక్ష్యమని కేంద్ర మంత్రికి వివరించారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమే టీ-ఫైబర్ యొక్క ప్రధాన ఉద్ధేశమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ -ఎడ్యుకేషన్ సేవలు అందించడం టీ – ఫైబర్ లక్ష్యమని చెప్పారు.
టీ-ఫైబర్ అమలుకుగానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి తెలంగాణ గవర్నమెంట్ పంపించిన డీపీఆర్‌ను ఆమోదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేయాలన్నారు. అదే విధంగా.. టీ-ఫైబర్ ఇంప్లిమెంట్కు రూ.1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా జ్యోతిరాదిత్యా సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.