- మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్
- స్కిల్ వర్సిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, ఫ్యూచర్ సిటీకి సహకారం
- ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు చేస్తామన్న సీఎం
- అన్నింటిలోనూ పారదర్శకత పాటిస్తామని వెల్లడి
- అభివృద్ధి ప్రణాళికల్లో కలిసివస్తామన్న ప్రపంచ బ్యాంక్
- వివిధ అంశాలపై గంటపాటు చర్చించిన అజయ్ బంగా, రేవంత్
- పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యమవుతామని ప్రకటించింది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరతతో పాటు వివిధ అంశాలపై దాదాపు గంటపాటు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ప్రధానంగా స్కిల్ డెవెలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి.
యుద్ధప్రాతిపదికన అమలు
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్నింటిలోనూ అత్యంత పారదర్శకతను పాటిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడికి ఆయన తెలిపారు.
ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పారు. ప్రాంతాలవారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వివరించారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది.
రాష్ట్రంతోపాటు హైదరాబాద్ అభివృద్ధికి సీఎం అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తున్నదని ప్రపంచ బ్యాంక్ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో భారత్ లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తుచేసింది. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది.
ప్రజాపాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ లురామకృష్ణారావు, జయేశ్ రంజన్, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదే ఫస్ట్ టైమ్
ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ ద్రవ్యసంస్థలతో తెలంగాణ రాష్ట్రం కలిసి పని చేయాలని నిర్ణయించడం ఇదే మొదటి సారి. రాష్ట్రంలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్శిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కీలక ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి అనుసరిస్తున్న భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు తెలిపింది. ఇది ప్రాజెక్టులకు మరింత ఊతమివ్వనుంది.
