చంద్రబాబూ.. మా ప్రాజెక్టులకు అడ్డుపడకు: సీఎం రేవంత్ రెడ్డి

చంద్రబాబూ.. మా ప్రాజెక్టులకు అడ్డుపడకు: సీఎం రేవంత్ రెడ్డి
  •  
  • మీకు రెండు రాష్ట్రాలు సమానమైతే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చెయ్​
  • మా ప్రాజెక్టులకు సహకరించకపోతే పోరాడైనా సాధించుకుంటం: సీఎం రేవంత్ రెడ్డి 
  • పాలమూరును ఎడారి చేసిందే కేసీఆర్.. 
  • ఆయన పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తం 
  • తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తెచ్చి రంగారెడ్డి జిల్లాకు ఇచ్చే బాధ్యత నాది
  • కేసీఆర్..​ నీ దుఃఖం మరో పదేండ్లు ఉంటది.. 
  • 2034 దాకా కాంగ్రెస్‌‌‌‌దే అధికారం 
  • నువ్వు అసెంబ్లీకి రావాలె.. మేం చేసే మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడ్వాలె 
  • నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్​ జిల్లా జటప్రోలు సభలో వ్యాఖ్యలు 

నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్/కొల్లాపూర్, వెలుగు: పదేండ్ల పాటు కేసీఆర్ పడావు పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని, దయచేసి వాటికి అడ్డుపడవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సూచించారు. వాటిని పూర్తి చేసేందుకు సహకరించాలని, లేదంటే ఎలా పూర్తి చేసుకోవాలో కూడా తమకు తెలుసన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ ​చేశారు. శుక్రవారం నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్​ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్​ ఇండియా రెసిడెన్షియల్​ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ ​రెడ్డి శంకుస్థాపన చేశారు. అక్కడి మదన గోపాలస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ‘ప్రజాపాలన -ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. 

మమ్మల్ని బతకనివ్వండి.. 

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భీమా, కోయిల్‌‌‌‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయని, ఆయన అపోజిషన్ లీడర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడే పాలమూరు–రంగారెడ్డి పనులు స్టార్ట్ అయ్యాయని.. అలాంటి ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని సీఎం రేవంత్​రెడ్డి నిలదీశారు. ‘‘ఒకప్పుడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండి.. మా ప్రాజెక్టులను పూర్తి చేసుకోనివ్వండి’’ అని అన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 4.5 టీఎంసీల నీరు తీసుకెళ్లాల్సి ఉంటే, ఇప్పుడు రోజుకు 9.5 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేలా ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకున్నారని.. అవి సరిపోక ఇంకా రాయలసీమ లిఫ్ట్‌‌‌‌తో రోజుకు మరో 3.5 టీఎంసీల నీటిని తరలించాలని చూస్తున్నారని సీఎం ఫైర్​అయ్యారు. ‘‘రెండు రాష్ట్రాలు సమానంగా డెవలప్ కావాలనే ఆలోచన మీకు ఉన్నది నిజమైతే.. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును రద్దు చేయండి. డిండి, పాలమూరు, కోయిల్ సాగర్, భీమా పూర్తి చేయడానికి సహకరించండి. మీరు సహకరించకపోతే పోరాడి సాధించుకునే శక్తి మాకు ఉంది’’ అని స్పష్టం చేశారు. 

పాలమూరు అంటేనే కేసీఆర్‌‌‌‌కు చిన్నచూపని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్​ నుంచి వలస వచ్చిన ఆయనను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని పార్లమెంట్‌‌కు పంపితే.. పాలమూరుకు ఏమీ చేయకపోగా, ఉల్టా ద్రోహానికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ‘‘2014లో తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం అయిన కేసీఆర్.. పదేండ్ల పాటు పాలమూరుకు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్​హయాంలో చేపట్టిన భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులతో పాటు పాలమూరు–-రంగారెడ్డి  ప్రాజెక్టును సైతం పెండింగ్‌‌లో పెట్టారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్షం చేశారని ఆరోపించిన కేసీఆర్..​ తెలంగాణ వచ్చాక ఆ ప్రాజెక్టుల పేరు మీద  రూ.2లక్షల కోట్లు ఖర్చు చేశారు. అందులో కనీసం రూ.25వేల కోట్లు కేటాయించినా పాలమూరు జిల్లాలోని పెండింగ్​ప్రాజెక్టులు పూర్తయ్యేవి. పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోకుండా పాలమూరు ప్రజల గుండెలపై తన్నారు” అని ఆగ్రహం వ్యక్త చేశారు. 

కేసీఆర్​పదేండ్లు పడావు​పెట్టిన పాలమూరు–రంగారెడ్డి, ఇతర ఇరిగేషన్​ ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్​ప్యాకేజీ కోసం డిసెంబర్​ 9లోగా నిధులిస్తామని ప్రకటించారు. రెండేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. తుమ్మడిహెట్టి నుంచి నీళ్లు తెచ్చి రంగారెడ్డి జిల్లాకు ఇచ్చే బాధ్యత తనదన్నారు. కేసీఆర్​రూ.లక్ష కోట్లు పోసి కట్టిన కాళేశ్వరం మూడేండ్లకే కూలేశ్వరం అయిందని.. కానీ కాంగ్రెస్​హయాంలో కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్​, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని పేర్కొన్నారు. ‘‘పదేండ్లు పాలమూరుకు ద్రోహం చేసిన కేసీఆర్‌‌‌‌కు దొంగలకు సద్దులు మోసినట్లుగా వ్యవహరించిన నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్‌‌లకు సిగ్గుండాలే.70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎంగా పనిచేసే అవకాశం వస్తే సంతోషించాల్సింది పోయి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు” అని ఫైర్ అయ్యారు. ‘‘పదేండ్ల పాలనలో శ్రీశైలం నిర్వాసితులకు 98 జీవో ప్రకారం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? వాళ్లు బంజారాహిల్స్​లో నీ ఇల్లునో, ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌నో, నీ కొడుకు ఫామ్‌‌హౌస్‌‌నో అడగలే.. సాగు, తాగునీటి అవసరాల కోసం భూములిచ్చినందుకు న్యాయం చేయమని అడిగారు.. అది కూడా చేయలేదు’ అంటూ కేసీఆర్‌‌‌‌పై ఫైర్​అయ్యారు. 

కేసీఆర్.. నీకు దుఃఖం ఎందుకు?

కేసీఆర్‌‌‌‌కు ఎందుకు దుఃఖం వస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌‌‌‌కు దుఃఖంగా ఉంది. పాలమూరు బిడ్డ సీఎం అయినందుకు దుఃఖం వస్తున్నదా? 19 నెలల మా ప్రజాపాలన చూసి దుఃఖం వస్తున్నదా? యాదవులు బర్రెలు, గొర్రెలు పెంచుకోవాలే.. గౌడన్నలు ఈదులు గీసుకోవాలే.. బెస్తలు చేపలు పట్టుకోవాలే.. దళితులు చెప్పులు కుట్టుకోవాలే అని భావించే కేసీఆర్‌‌‌‌కు అలా కాకుండా వారి పిల్లలు యంగ్ ఇండియా రెసిడెన్షియల్​స్కూల్స్​లో చదివి, భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్‌‌లు, డాక్టర్లు, ఇంజినీర్లు అయితే ఎలా? అనే రందితో దుఃఖం వస్తున్నదా?’’ అని ప్రశ్నించారు. తాను, తన బిడ్డలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏలాలని కేసీఆర్​కలలు కన్నారని.. కానీ ఓ పాలమూరు బిడ్డ 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కంకణం కట్టుకొని పని చేస్తున్నందుకే  కేసీఆర్‌‌‌‌కు దుఃఖం వస్తోందన్నారు. 40 ఏండ్లుగా మాదిగ బిడ్డలు వర్గీకరణ కోసం పోరాడుతుంటే  పట్టించుకోని కేసీఆర్‌‌‌‌కు తాము వర్గీకరణ చేసినందుకు దుఃఖం వస్తోందని ఎద్దేవా చేశారు. -తెలంగాణలో ఉద్యోగాలు వచ్చి ఆర్థికంగా యువత, మహిళలు బాగుపడుతుంటే కేసీఆర్, ఆయన కుటుంబానికి దుఃఖం వస్తోందని ఫైర్ అయ్యారు.

 ‘‘కేసీఆర్ ​.. నీ దుఃఖం ఇంకో పదేండ్ల వరకు అట్లనే ఉంటది. అది పెద్దదై నిన్ను కబళిస్తుంది. నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి. నీ కండ్ల ముందు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటా. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. నీ గుండెల మీద, నీ కొడుకు గుండెల మీద రాసిపెట్టుకో కేసీఆర్.. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటది. ఈ పాలమూరు బిడ్డనే సీఎంగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. నా కోరిక ఒక్కటే.. కేసీఆర్ అసెంబ్లీ రావాలె. అపోజిషన్‌‌లో ఆయన కూర్చోవాలే. మేం చేసే మంచి పనులు చెబుతుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడ్వాలె. అందుకే నిన్ను అసెంబ్లీకి రమ్మంటున్నా. అసెంబ్లీకి వస్తే నువ్వు చేసిన ద్రోహం, అన్యాయం ఏంటో తెలుస్తది’’ అంటూ కేసీఆర్‌‌‌‌పై రేవంత్ విరుచుకుపడ్డారు.  

అప్పులు వెంటాడుతున్నా హామీల అమలు: మంత్రి జూపల్లి

కేసీఆర్ చేసిన అప్పులు తమ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్​రెడ్డి అన్ని హామీలను అమలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వెనుకబడిన కొల్లాపూర్​అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌లోనే అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌‌ను గెలిపించి సీఎంకు గిఫ్ట్‌‌గా ఇద్దామని క్యాడర్‌‌‌‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 3లక్షల52వేల635 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.344 కోట్ల  చెక్కులను సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 6 కోట్ల 33 లక్షల  చెక్కులను, ఇదే నియోజకవర్గంలోని 570 స్వయం సహాయక సంఘాలకు రూ. 41 కోట్ల 61 లక్షల బ్యాంకు రుణాలను అందజేశారు.