- ఐఐటీ ఖరగ్‌పూర్ రిపోర్టు ఆధారంగా ముంపు పరిహారం
- వంద ఎకరాలే ముంపు ఉంటుందన్న ఐఐటీ ఖరగ్‌పూర్ స్టడీ
- బ్యారేజీ ఉన్నా లేకపోయినా సహజంగానే ముంపు ఉంటుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాగునీటి రంగానికి కీలకమైన సమ్మక్క–సారలమ్మ (సమ్మక్క సాగర్) బ్యారేజీకి ఉన్న అంతర్రాష్ట్ర అడ్డంకులను తొలగించుకునే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. చత్తీస్‌గఢ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ని సాధించేందుకు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్తో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న ప్రాజెక్ట్ డీపీఆర్‌ను వెనక్కి పంపిన నేపథ్యంలో.. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. సోమవారం సీడబ్ల్యూసీ చైర్మన్‌తోనూ భేటీ అయ్యారు. ఈ వరుస ప్రయత్నాలకు కొనసాగింపుగా మంగళవారం నాటి రాయ్‌పూర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అంచనా కన్నా ముంపు తక్కువే
సమ్మక్క సాగర్ బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టం +83 మీటర్లు కాగా.. ఆ స్థాయిలో చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం తహసీల్ పరిధిలో కేవలం 181 ఎకరాలే ముంపునకు గురవుతాయని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అందులో 32 ఎకరాలు వ్యవసాయ భూములైతే.. 133 ఎకరాలు నదీ గర్భంలోనే ఉంటుందని, మరో 16 ఎకరాలు నాలా భూమి అని తెలిపింది. కాగా 2022 జూలైలో గోదావరికి 88 మీటర్ల మేర గరిష్ఠ వరద వచ్చినందున, భారీ వరదల సమయంలో బ్యాక్‌వాటర్ ప్రభావం ఎలా ఉంటుందో తేల్చాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణులతో ప్రత్యేక స్టడీ చేయించింది.
ఆ రిపోర్టులోని అంశాలు కూడా తెలంగాణ వాదనలకు బలం చేకూర్చేలా వచ్చాయి. 500 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత భారీ వరద సుమారు 36 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు బ్యారేజీ ఉన్న పరిస్థితుల్లో గరిష్ఠ వరద మట్టం 93 మీటర్లకు చేరుతుంది. అదే బ్యారేజీ లేని సహజ స్థితిలోనైనా వరద మట్టం 90.87 మీటర్లకు చేరుతుందని నివేదిక స్పష్టం చేసింది. అంత భారీ వరద వచ్చినప్పుడు బీజాపూర్ జిల్లాలోని కొత్తూరు, తర్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరం (అలాగే 87 మీటర్ల వరద వద్ద పోటరు) గ్రామాల పరిధిలో వ్యవసాయ, అటవీ, ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 10.9 చదరపు కిలోమీటర్ల మేర ముంపు ఉంటుందని ఐఐటీ ఖరగ్‌పూర్ అంచనా వేసింది.
బ్యారేజీ లేకపోయినా సహజంగానే 10.5 చదరపు కిలోమీటర్లు ముంపునకు గురవుతాయని, కేవలం బ్యారేజీ నిర్మాణం వల్ల పెరిగే అదనపు ముంపు 0.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే దాదాపు 40 హెక్టార్లు (సుమారు 100 ఎకరాలు) మాత్రమేనని నివేదిక తేల్చిచెప్పింది. ఈ నివేదిక సిఫార్సులన్నింటినీ తప్పకుండా అమలు చేయడంతో పాటు, ఐఐటీ ఖరగ్‌పూర్ లెక్కల ప్రకారం ఎంత భూమి, ఆస్తులు ముంపునకు గురైతే అంతకూ పూర్తి పరిహారం, పునరావాసం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
మూడుసార్లు చర్చలు..
సమ్మక్క సాగర్ బ్యారేజీ పనులు 2021–22లోనే పూర్తయినా చత్తీస్‌గఢ్ ఎన్వోసీ లేకపోవడంతో పూర్తిస్థాయి నీటినిల్వకు అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ఉత్తమ్.. ఏడాది కాలంలోనే మూడు సార్లు ఛత్తీస్‌గఢ్ సీఎంతో భేటీ అయ్యారు. తొలిసారిగా నిరుడు సెప్టెంబర్ 22న రాయ్‌పూర్ వెళ్లి విష్ణుదేవ్ సాయ్తో భేటీ అయిన ఉత్తమ్, ముంపు బాధితులకు పూర్తిస్థాయి పరిహారం, భూసేకరణ, పునరావాస ఖర్చులను తెలంగాణ భరిస్తుందని హామీ ఇచ్చారు.
దీంతో విష్ణుదేవ్ సాయ్ సూత్రప్రాయంగా ఎన్వోసీకి అంగీకారం తెలిపారు. రెండోసారి ఈ ఏడాది జూన్ 11న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎంతో మరోసారి సమావేశమై, సీడబ్ల్యూసీ ఇంటర్-స్టేట్ డైరెక్టరేట్ అనుమతి కోసం వెంటనే ఎన్వోసీ జారీ చేయాలని లేఖ అందించారు. ఇక, మూడో సారి ఈ ఏడాది సెప్టెంబర్ 3న ఢిల్లీలో భేటీ అయ్యారు. అవసరమైతే పరిహారం సొమ్మును ముందే (అడ్వాన్స్‌గా) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తామని ప్రతిపాదించారు. ఆ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు బీజాపూర్ జిల్లాలో పూర్తిస్థాయి నీటిమట్టం, బ్యాక్‌వాటర్ ముంపు హద్దులను గుర్తించే సమగ్ర సర్వే కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తెలంగాణ ప్రభుత్వం రూ.9.88 కోట్లను ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు చెల్లించింది.
