- త్వరలోనే రివర్ ఫ్రంట్ పనులు: సీఎం రేవంత్
- లండన్‌లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరణ
- ప్రపంచ పర్యాటకులు వచ్చేలా డెవలప్ చేస్తామని వెల్లడి
- హైదరాబాద్‌లో గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు:రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. త్వరలోనే మూసీ రివర్ ఫ్రంట్పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని గోపన్‌పల్లిలో రూ.28.50 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని అన్నారు.
‘‘ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. దాన్ని లండన్ లోని థేమ్స్ నదిలాగా సుందరీకరిస్తాం. రాబోయే ఐదేండ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు.
రానున్న పదేండ్లలో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘రాష్ట్ర ఆదాయంలో 65 శాతం భాగ్యనగరం నుంచే వస్తున్నది. ఎక్కడ నుంచి వచ్చిన వారినైనా హైదరాబాద్ అక్కున చేర్చుకుంటుంది. ఓఆర్ఆర్వరకు సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం హైడ్రా ఏర్పాటు చేశాం” అని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామన్నారు.
‘‘హైదరాబాద్ అభివృద్ధికి ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు పునాదులు వేస్తే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేం మరింత అభివృద్ధి చేస్తాం. ఐటీ అంటే ఒక ముఖ్యమంత్రి, ఎయిర్ పోర్ట్ అంటే ఇంకో ముఖ్యమంత్రి గుర్తుకువస్తారు. అట్ల ప్రజాప్రభుత్వం అంటే గుర్తుకువచ్చేలా అభివృద్ధి చేస్తాం” అని అన్నారు. శేరిలింగంపల్లిలో చెరువులను కాపాడుతామని చెప్పారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
