
- రాష్ట్ర ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి
- రెండు దశల్లో నిర్మాణం.. కేటగిరీ ‘ఏ’కు 24,269 కోట్లు..‘బీ’కి రూ.19,579 కోట్లు
- సమగ్ర మెట్రో విస్తరణకు కేంద్రం మద్దతు అవసరమని వెల్లడి
- పార్క్ హయత్‌లో ఎంపీలకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రజంటేషన్
- కాంగ్రెస్ ఎంపీలతోపాటు హాజరైన బీజేపీ ఎంపీలు ఈటల, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మెట్రో రెండో దశ విస్తరణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, కేవలం తమకు అనుకూలమైన మార్గాలకే ప్రాధాన్యత ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మెట్రో ఫేజ్-–2 విస్తరణకు కేంద్రం త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. ఇందుకోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకతీతంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో మెట్రో రెండో దశకు సంబంధించిన అంశాలపై ఎంపీలకు అవగాహన కల్పించేందుకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, రఘురామరెడ్డి, బలరాం నాయక్, అనిల్‌కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు హాజరయ్యారు.
ప్రాజెక్టుకు సంబంధించి ఎంపీలు అడిగిన సందేహాలను ఎన్వీఎస్ రెడ్డి నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరుగుతున్న ట్రాఫిక్, ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మెట్రో ఫేజ్–-2 కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, వాటిని కేంద్రానికి పంపించామని తెలిపారు. హైదరాబాద్ కంటే చిన్న నగరాలైన ఆగ్రా, భోపాల్, భువనేశ్వర్, ఇండోర్, కాన్పూర్, కొచ్చి, లక్నో, మీరట్, నాగ్‌పూర్, పాట్నా, పుణె, సూరత్, త్రివేండ్రంలాంటి 20 పట్టణాలకు కేంద్రం ఇటీవల మెట్రో మంజూరు చేసిందని గుర్తు చేశారు. చెన్నై మెట్రో ఫేజ్-2కు రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రో ఫేజ్-2, ఫేజ్-3లకు కలిపి రూ.30,399 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణపై వివక్ష చూపొద్దు
దేశం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్‌లాంటి మహానగరాలు కీలక పాత్ర పోషిస్తాయని భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు, ఉపాధికి స్వర్గధామమైన హైదరాబాద్‌కు మెట్రోను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. 2047 నాటికి ‘‘రైజింగ్ తెలంగాణ’’ నినాదంతో 2 ట్రిలియన్ ఎకానమీగా మారబోతున్నామని తెలపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు తావులేకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశ ఆర్థిక పరిపుష్టిలో భాగస్వామ్యం అందిస్తున్న తెలంగాణకు ఎలాంటి వివక్ష చూపకుండా కేంద్రం పెద్దన్న సహాయం అందించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లోని 'ఏ' కేటగిరీలో 7 లక్షల 96వేల మంది, 'బీ' కేటగిరీలో 6 లక్షల 55వేల
మంది మెట్రోలో ప్రయాణిస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిత్యం 5 లక్షల మంది మెట్రోలో రాకపోకలు
సాగిస్తున్నారని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండో దశను 'ఏ' మరియు 'బీ' కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు.
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు వివరాలు
కేటగిరీ 'ఏ' వివరాలు..
రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలో మీటర్ల దూరం నిర్మించే ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.4,230 కోట్లు (18%)
రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.7,313 కోట్లు (30%)
రుణ సేకరణ ద్వారా: రూ.11,693 కోట్లు (48%)
పీపీపీ విధానం ద్వారా: రూ.1,033 కోట్లు (4%)
కేటగిరీ 'ఏ'లో 5 కారిడార్లు..
నాగోల్ –రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్: 36.8 కిలో మీటర్లు. - అంచనా వ్యయం రూ.11,226 కోట్లు
రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్: 11.6 కిలోమీటర్లు.. - అంచనా వ్యయం రూ.4,318 కోట్లు
ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట: 7.5 కిలో మీటర్లు.. - అంచనా వ్యయం రూ.2,741 కోట్లు
మియాపూర్ – పఠాన్‌చెరు: 13.4 కిలో మీటర్లు.. - అంచనా వ్యయం రూ.4,107 కోట్లు
ఎల్బీనగర్ –హయత్‌నగర్: 7.1 కిలో మీటర్లు.. - అంచనా వ్యయం రూ.1,877 కోట్లు
కేటగిరీ 'బీ' వివరాలు..
రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 86.1 కిలో మీటర్ల దూరం నిర్మిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.5,874 కోట్లు (30%)
కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.3,524 కోట్లు (18%)
రుణ సేకరణ ద్వారా: రూ.9,398 కోట్లు (48%)
పీపీపీ విధానం ద్వారా: రూ.783 కోట్లు (4%)
కేటగిరీ 'బీ'లో 3 కారిడార్లు..
కారిడార్ –9 -
రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్ – ఫ్యూచర్ సిటీ స్కిల్ వర్సిటీ: 39.6 కిలో మీటర్లు... - అంచనా వ్యయం రూ.7,168 కోట్లు
కారిడార్ –10 -
జేబీఎస్–మేడ్చల్: 24.5 కిలో మీటర్లు.. - అంచనా వ్యయం రూ.6,946 కోట్లు
కారిడార్ –11 -
జేబీఎస్ –శామీర్‌పేట: 22 కిలో మీటర్లు.. - అంచనా వ్యయం రూ.5,465 కోట్లు