- ఉద్యోగుల పనితీరుతోనే ప్రభుత్వానికి పేరొస్తది
- కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్, వెలుగు: సమస్యతో, బాధతో, నిస్సహాయ స్థితిలో కలెక్టరేట్ గడప తొక్కే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకం కలిగించేలా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజల సమస్యలను కుటుంబ సభ్యుల సమస్యలుగా భావించి పరిష్కరించాలని, వారి కన్నీరు తుడవాలన్నారు. ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా పనిచేయాలని చెప్పారు. కరీంనగర్‌లో రూ.51 కోట్లతో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తొలుత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్‌ను సీఎం సందర్శించారు. వేద మంత్రాలు, సర్వమత ప్రార్థనల మధ్య జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేట్ చాంబర్‌ను సీఎం పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌లోని సమా వేశ మందిరంలో ప్రత్యేకంగా ఆహ్వానితులైన జిల్లా ప్రముఖులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఉద్యోగులే కీలకం
మూడు శాతం మంది ఉద్యోగులు 97 శాతం మంది ప్రజలకు సేవలందిస్తున్నారని, ఇది ఎంతో నిష్ఠ, శ్రమతో కూడుకున్న బాధ్యత అని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా.. చెడ్డ పేరు రావాలన్నా ఉద్యోగులే కీలకమని అన్నారు. ‘‘ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. జీతభత్యాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పదోన్నతులు, బదిలీలు, ఆరోగ్య భద్రత కార్డులులాంటి ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సహకారంతో పరిష్కరిస్తున్నాం.
ప్రజలకు సేవలు అందిస్తూనే తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం” అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.840 కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ నగర అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. గౌరవెల్లి రిజర్వాయర్ 98 శాతం పూర్తయిందని, సుప్రీంకోర్టులో కేసు కారణంగా మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఇటీవల సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, వీసీ ఉమేశ్ కుమార్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ , కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే , శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి పాల్గొన్నారు.
శంకుస్థాపనలు ఇవే..
రూ.29.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న మూడు తెలం గాణ పబ్లిక్ స్కూల్స్
అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్లతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు
యూఐడీఎఫ్ పబ్లిక్ హెల్త్ స్కీం కింద రూ.180 కోట్లతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు
కేఎస్ సీసీఎల్ స్పెషల్ గ్రాంట్స్ కింద రూ.21.60 కోట్లతో చేపట్టిన వరదనీటి మురుగు కాల్వల నిర్మాణ పనులు
కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద పార్కింగ్ సమస్య లేకుండా రూ.25 కోట్లతో చేపట్టనున్న
మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ బిల్డింగ్ నిర్మాణ పనులు
ప్రారంభోత్సవాలివే..
రూ.51 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్
5.70 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ బిల్డింగ్
రూ.6.50 కోట్లతో నిర్మించిన కశ్మీర్ గడ్డ
ఇంటిగ్రేటెడ్ వెజ్,-నాన్ వెజ్ మార్కెట్
రూ.16.50 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డీఆర్ఎఫ్ బిల్డింగ్
సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నిసార్లయినా ఢిల్లీకి..
తన ఢిల్లీ పర్యటనలను కొంతమంది అపహాస్యం చేస్తూ 78 సార్లు ఢిల్లీ వెళ్లారని విమర్శిస్తున్నారని, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్లాల్సిందేనని సీఎం రేవంత్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి 170 ఎకరాల డిఫెన్స్ భూమి మంజూరు చేసిందని, హైదరాబాద్ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతాలైన కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలకు రావాలంటే కంటోన్మెంట్ ప్రాంతం బాటిల్‌నెక్‌గా ఉందని సీఎం తెలిపారు.
1995 నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదని, 2023లో తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 6 నెలల కాలంలో కంటోన్మెంట్ ప్రాంతంలో 170 ఎకరాల డిఫెన్స్ భూమిని రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని గుర్తుచేశారు. ప్రజల అభివృద్ధి కోసం సిద్ధాంతపరమైన వైరుధ్యాలను పక్కనపెట్టి కేంద్రంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్ధికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులు, సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు తదితర అనేక అంశాలపై కరీంనగర్ జిల్లాలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించేందుకు మరోసారి వస్తానని సీఎం తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితోపాటు బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలెక్టర్ చిత్రా మిశ్రా సన్మానించి మెమొంటోలు అందజేశారు.
