న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆదివారం మణిపూర్​లోని థౌబల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో పలు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ మెంబర్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ వెంట కలిసి కదిలారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రాహుల్ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి మణిపూర్ వెళ్లారు. ఇదే విమానంలో రాహుల్ వెంట దాదాపు100 మందికి పైగా నేతలు మణిపూర్ చేరుకున్నారు.

వారిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ ఎంపీ మధుయాష్కి, కాంగ్రెస్ నేత షర్మిల వెళ్లగా.. సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, ఇతర ముఖ్య నేతలు నేరుగా మణిపూర్ చేరుకున్నారు. ఉత్సాహంగా ప్రారంభమైన ఈ యాత్రలో తెలంగాణ నేతలు మరింత జోష్​తో ముందుకు కదిలారు. న్యాయ్ యాత్ర వేదిక వద్ద ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్​చార్జి మాణిక్కం ఠాకూర్, ఇతర జాతీయ స్థాయి నేతలతో సెల్ఫీ తీసుకున్నారు.

దేశాన్నే ఇల్లుగా చేసుకున్నడు

‘‘దేశాన్నే ఇల్లుగా, జనాన్నే కుటుంబ సభ్యులుగా చేసుకున్న నాయకుడు రాహుల్​గాంధీ. సామాన్యుడి సమరమై.. మధ్య తరగతి గమ్యమై.. పేదవాడి గమనమై.. ఆడబిడ్డల ధైర్యమై.. యువత ఆశల సారథై.. రైతు కష్టం తీర్చే కర్షకుడై.. కదులుతున్న మరో మహాయాత్ర. జై బోలో భారత్​న్యాయ్​యాత్ర’’ అని సీఎం రేవంత్​ ట్వీట్ ​చేశారు.