- ‘ఇందిరమ్మ’ రెండో విడత ఇండ్ల నిర్మాణానికి శిలాఫలకం
ఆసిఫాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశ మహోత్సవం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొత్తగూడలో సోమవారం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభివృద్ధికి నోచుకోని గూడెమైన కొత్తగూడలో అత్యంత వెనుకబడిన కోలం ఆదివాసీలకు ఆధునిక వసతులతో ప్రభుత్వం 25 పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గృహప్రవేశాలకు రావడంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కోలం కోటారి పంచాయతీలోని కొత్తగూడ గ్రామానికి చేరుకున్నారు.
ఆయనతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొవ లక్ష్మి, బోజ్జు, వినోద్, గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి లబ్ధిదారులు టేకం పగ్గుబాయి, సిడం కన్నిబాయి, ఆత్రం పోచులతో కలిసి పూజలు చేసి గృహప్రవేశం చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో భాగంగా 25 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన ఆదివాసీలతో, మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఒక అంగన్వాడీ టీచర్‌ను నియమించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 21 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించినట్టు సీఎం చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో గిరిజనులందరికీ శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అత్యవసర సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తానన్నారు. మరోవైపు, ఆసిఫాబాద్ జిల్లాలో రూ.112.14 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
