సీఎం రేవంత్ బర్త్ డే స్పెషల్: 17 ఏండ్లలోనే లక్ష్యాన్ని సాధించిన మాస్ లీడర్

సీఎం రేవంత్ బర్త్ డే స్పెషల్: 17 ఏండ్లలోనే లక్ష్యాన్ని సాధించిన మాస్ లీడర్

రాజకీయాల్లోకి అడుగుపెట్టి  కేవలం పదిహేడు సంవత్సరాల్లోనే రాష్ట్ర  ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విప్లవాత్మక నాయకుడు అనుముల రేవంత్ రెడ్డి.  2006లో మహబూబ్‌‌నగర్ జిల్లా మిడ్జెల్ జడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం 2023 డిసెంబర్ 7న  తెలంగాణ రెండో  ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించి కీలక మైలురాయికి చేరుకుంది. 

కేవలం కాలగమనమేగాక, కృషి, కఠోర శ్రమ, ప్రజా నిబద్ధతతో నిండిన ఒక అపూర్వ యాత్ర ఆయనది.  ‘ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ .. నేను రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏండ్లలోనే  అనుకున్న లక్ష్యాన్ని సాధించాను’.  అని ఇటీవల నియామక పత్రాలు అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, ఆయన జీవనగాథకు ప్రతిబింబం.

జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదగడం అనేది అంత సులభం కాదు.  ఇది ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసం, ప్రజలపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రజానాయకుడు

సీఎం రేవంత్ రెడ్డి  రాజకీయ జీవితం ప్రజలతో  మమేకమై సాగింది.  2006లో  స్వతంత్ర జడ్పీటీసీగా గెలిచి, 2007లో ఎమ్మెల్సీగా, 2009, 2014లో  కొడంగల్‌‌ ఎమ్మెల్యేగా,  2019లో  మల్కాజిగిరి  పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు.   2021లో  టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి  నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌‌కు  పునర్జీవం పోశారు. 

ఆయన అంకితభావం, అగ్రెసివ్‌‌ నాయకత్వం వల్లే కాంగ్రెస్ తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. రాజకీయాల్లో సాధ్యాసాధ్యాల సరిహద్దులను చెరిపేసిన నాయకుడు   రేవంత్ రెడ్డి.  అసెంబ్లీ  ఎన్నికల్లో  ఒంటి చేతితో  ప్రచారం నిర్వహించి, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. దూరదృష్టి కలిగిన నిర్వాహకుడు, విజినరీ అడ్మినిస్ట్రేటర్. 

పథకాల విప్లవం.. పేదల పాలన

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతోంది.  రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రుణమాఫీ, మహిళల ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ  సాయం రూ.10 లక్షలకు పెంపు.. ఇవన్నీ  ప్రజాపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి.  రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్లకు పైగా లబ్ధిదారులకు సన్నబియ్యం అందించడం, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం, 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం వంటి చర్యలు ఆయన పాలనకు ప్రజానుకూల దృఢత్వాన్నిచ్చాయి.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల  కోసం శాసనసభలో బిల్లు ఆమోదం,  ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత,  కులగణన సర్వే.  ఇవన్నీ సామాజిక న్యాయానికి  సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న  అంకితభావానికి  నిదర్శనాలు.   దేశంలో  ఎస్సీ వర్గీకరణ చేసిన తొలిరాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.  ప్రతి ఫిబ్రవరి 4న  ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’గా జరపాలని నిర్ణయం కూడా ఆయన దృఢ సంకల్పానికి చిహ్నం.

హైదరాబాద్‌‌ను ప్రపంచ నగరంగా...

‘హైదరాబాద్.. లండన్, న్యూయార్క్‌‌ల సరసన ఉండాలి’ అని రేవంత్ రెడ్డి ప్రకటన కేవలం స్లోగన్ కాదు.  అది ఓ మహా  ప్రణాళిక.  ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, హైడ్రా, మూసీ పునరుజ్జీవం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులు ఆయన విజన్‌‌ను తెలియజేస్తున్నాయి. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, ఉద్యోగాలు, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అందిస్తున్నారు. రాహుల్ గాంధీ విజన్‌‌ను భారత రాజకీయాల్లో  నిజం చేయాలనే కార్యసాధకుడు సీఎం రేవంత్ రెడ్డి.  ‘రాహుల్ గాంధీని  ప్రధానమంత్రిగా చేసేవరకు నాకు విశ్రాంతి లేదు’ అనే ఆయన సంకల్పం, కాంగ్రెస్‌‌లో  కొత్త తరం ఉత్సాహానికి  ప్రతీక.

మానవతావాది

ప్రజల సమస్యలు విన్న వెంటనే స్పందించే  నేతగా  రేవంత్ రెడ్డి మంచి మానవతా గుణాలను ఆచరిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే  స్వభావం ఆయనను మాస్ లీడర్‌‌గా మార్చింది.  ప్రజల ప్రతి ఇంటి వేడుకలో, వేదనలో తన ప్రభుత్వం ఉన్నదనే భరోసా కలిగిస్తున్నారు. నేడు నవంబర్ 8 సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం.  పదిహేడు ఏండ్ల ప్రయాణంలో ఆయన చేసింది తరతరాలకు ప్రేరణ. రాజకీయాల్లో కష్టపడితే లక్ష్యాలు సుసాధ్యమవుతాయనే సజీవ సాక్ష్యం రేవంత్ రెడ్డి.  ఆయనకు తెలంగాణ ప్రజల అభినందనలు, అభిమానం ఎల్లప్పుడూ అండగా ఉంటాయి.

హ్యాపీ బర్త్‌‌డే టూ యూ సీఎం రేవంత్ అన్న!

- వెలిచాల రాజేందర్ రావు,
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌చార్జ్​