- బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి
- మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
- ఇంటింటికీ వెళ్లి స్కీమ్‌లు వివరించండి
- మహిళల ఓట్లు ఒక్కటీ చేజారొద్దు
- పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి
- పోల్ మేనేజ్మెంట్కు పకడ్బందీ ప్లాన్ చేసుకోవాలి
- ఓటర్లను ప్రతిపక్షాలు గందరగోళానికి గురిచేయొచ్చు
- అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్‌కు
- భారీ మెజార్టీ దక్కేలా చూడాలని సూచన
హైదరాబాద్, వెలుగు:
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, అదే సమయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాబోయే మూడు రోజులే ప్రచారానికి అత్యంత కీలకమని, ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పథకాల గురించి వివరించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారానికి ఎక్కడికక్కడ చెక్‌పెట్టాలని చెప్పారు.
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని, పోల్ మేనేజ్మెంట్ విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు ఆఫీసులో మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘‘గ్రౌండ్ రిపోర్టు ప్రకారం కాంగ్రెస్‌దే విజయం. ప్రచారంలో చివరి మూడు రోజులే అత్యంత కీలకం. ఇప్పుడు చేసే ప్రచారమే గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరింత అప్రమత్తంగా ఉంటూ బస్తీల్లో విస్తృతంగా తిరగాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ముఖ్యంగా మహిళల వద్దకు వెళ్లాలని, వారికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటి స్కీముల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. కాంగ్రెస్ విజయంలో మహిళలే కీలకమైనందున వాళ్ల ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకోవాలన్నారు. మహిళా మంత్రులు, మహిళా నేతలు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలను కలవాలని ఆయన సూచించారు.
మూడు రోజులు కష్టపడితే భారీ మెజారిటీ
రాబోయే మూడు రోజులు కష్టపడితే ఇన్ని రోజులు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని, భారీ మెజారిటీ కూడా వస్తుందని మంత్రులతో సీఎం రేవంత్ అన్నారు. ఈ గెలుపు ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తాయని, గ్రేటర్ లో కాంగ్రెస్ కు ఇక తిరుగు ఉండదనే విశ్వాసం పార్టీ కేడర్‌లో నింపినట్లు అవుతుందని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మూడు రోజులు బూత్ స్థాయిలోకి వెళ్లాలని, ఈ రెండేండ్లలో మహిళలు, పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలన్నారు.
ఇప్పటి వరకు జరిగిన ప్రచారం తీరు, తన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లకు వచ్చిన స్పందన, మంత్రులు చేస్తున్న పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంలో జనం నాడీపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఇప్పటి వరకు బస్తీల వారీగా జరిగిన ప్రచారం, ఏ వర్గం వారు ఎలా స్పందించారు, ఏ వర్గం వారు మనకు అనుకూలంగా ఉన్నారనే వివరాలను ఆయన మంత్రులను అడిగి తెలుసుకున్నారు. మైనార్టీల విషయంలో మంత్రి అజారుద్దీన్, సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఇతర మైనార్టీ నేతలు ఎక్కువగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
పోలింగ్ శాతాన్ని పెంచండి
ప్రచారం ముగియగానే పోలింగ్‌పై దృష్టి పెట్టాలని, పోల్ మేనేజ్మెంట్కు పకడ్బందీ ప్లాన్ రెడీ చేసుకోవాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 40 నుంచి 50 శాతం దాటలేదని.. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలని, ప్రతి ఓటరు పోలింగ్ బూత్ వరకు చేరుకునేలా, ప్రభుత్వ అభివృద్ధికి ఓటు వేసేలా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండేలా మంత్రులు, ఎమ్మెల్యేలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన చెప్పారు. పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ వెనుకబడొద్దని, ప్రత్యర్థి పార్టీలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ రోజున ప్రతి క్షణం అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు.
అదే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌పై సోషల్‌మీడియాలో బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ఓటర్లను అయోమయానికి, గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందన్నా రు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎప్పటి కప్పుడు తిప్పికొట్టాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాను మరింత అప్రమత్తం చేయాలని, ప్రజలకు వాస్తవాలను వివరించడంలో ముందుండాలన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కేవలం సోషల్ మీడియా ద్వారా గెలవాలని చూస్తున్నారని, కానీ జనం మనవెంటే ఉన్నందున జనాన్ని నమ్ముకొని పనిచేయాలని మంత్రులకు పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 40 నుంచి 50 శాతం దాటలేదు. ఈసారి పోలింగ్ శాతం పెరిగేలా చూడాలి. ప్రతి ఓటరు పోలింగ్ బూత్ వరకు చేరుకునేలా ప్రోత్సహించాలి. పోల్ మేనేజ్మెంట్లో ఎక్కడా వెనుకబడొద్దు.
- సీఎం రేవంత్
