- అప్పులు, ఆదాయాన్ని పారదర్శకంగా వెల్లడించాం
- మీడియాతో చిట్‌చాట్
- రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం
- పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌తో హాజరు పెరుగుతుంది
- గత ప్రభుత్వం చేసిన అప్పులకు 3 లక్షల 30 వేల కోట్లు కట్టినం
- బీఆర్ఎస్ నేతల డ్రగ్స్ కేసుపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించరు?
- కేసీఆర్‌ను కేటీఆర్, హరీశ్ బంధించారేమో? ..అందుకే అసెంబ్లీకి రావడం లేదు
- విద్యా వ్యవస్థలో సమూల మార్పులు.. ప్లస్ 2 విద్యా విధానం తెస్తం
- నా లెక్క ఎప్పుడూ తప్పలే.. మళ్లీ అధికారం మాదేనని కామెంట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టింది ‘ఫ్యూచరిస్టిక్ బడ్జెట్’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర అప్పులు, ఆదాయాన్ని కూడా పారదర్శకంగా వెల్లడించామని తెలిపారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అప్పులను, తప్పులను కప్పిపుచ్చి బడ్జెట్‌ను రూపొందించారని, తాము అలా చేయలేదని చెప్పారు.
గత పదేండ్లపాటు బీఆర్ఎస్ చేసిన అప్పులకు ఈ 26 నెలల్లో తమ ప్రభుత్వం రూ. 3 లక్షల 30 వేల కోట్లు కట్టిందని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 3 లక్షల 47 వేల కోట్ల అప్పులు చేసినట్టు తెలిపారు. శుక్రవారం శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియాతో రేవంత్‌రెడ్డి చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డులున్న వాళ్లందరికీ రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు చెవిలో పువ్వులు పెట్టుకోవడంపై సీఎం స్పందిస్తూ.. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తెచ్చినందుకు చెవిలో పువ్వులు పెట్టకున్నారా? అని ప్రశ్నించారు.
ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే బీజేపీ నేతలు ఎందుకు స్పందించరని సీఎం నిలదీశారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై సీఎం స్పందిస్తూ..‘ఆయన్ను కేటీఆర్, హరీశ్ బంధించారేమో.. అందుకే అసెంబ్లీకి రావడం లేదు” అని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై ఎవరైనా తమకు ఫిర్యాదు చేసినప్పుడు తప్పకుండా ప్రభుత్వం పక్షాన స్పందిస్తామని అన్నారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కాని అమ్మడం ద్వారా వచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టడం అనేది ముఖ్యమని స్పష్టం చేశారు. తన లెక్క ఎప్పుడూ తప్పలేదని, మళ్లీ అధికారం తమదేనని మరోసారి రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు..
రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనిపై కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. ఈ మార్పులపై కమిటీ ఇచ్చే నివేదికనే ఫైనల్ కాదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే విద్యా విధానంలో మార్పులు తీసుకురాబోతున్నామని చెప్పారు. దేశమంతా ప్లస్ 2 విద్యా విధానం అమల్లో ఉందని, మన దగ్గరే 10 వ తరగతి, ఇంటర్మీడియెట్ వేర్వేరుగా ఉన్నాయని సీఎం వెల్లడించారు. అందుకే తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయడంపై స్టడీ చేస్తున్నామని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో చట్టం ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, అందుకే అసలు దోషులకు శిక్ష పడడంలో కొంత సమయం పడుతున్నదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్‌రావు దేశంలో లేకపోవడంతో కేసు విచారణ 20 నెలలు ఆలస్యమైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుకు ఊరట లభించలేదని చెప్పారు.
హరీశ్‌పై సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పెట్టిన ఫోన్ ట్యాపింగ్, వేధింపుల కేసులో మాత్రమే ఆయనకు ఉపశమనం లభించిందని సీఎం చెప్పారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో ఐఏఎస్ అరవింద్‌కుమార్‌పై చర్యలు తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు రమ్మని పిలిస్తే వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హిల్ట్ పాలసీ, టీడీఆర్‌పై విచారణకు సిద్ధం
హిల్ట్ పాలసీ, టీడీఆర్ భూ బదలాయింపులో ఎలాంటి అవినీతి జరగలేదని, దీనిపై ఏ ఏజెన్సీతోనైనా సరే విచారణకు సిద్ధమని కేటీఆర్, హరీశ్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. హిల్ట్ పాలసీ వల్ల రూ. 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదన్నారు. ఇండస్ట్రీకి చెందిన మొత్తం భూములు అమ్మినా లక్ష కోట్ల రూపాయలు కూడా రావని, అలాంటిది రూ. 5 లక్షల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా దానిపై ఉన్న అప్పుల్లో తమ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. 44 వేల కోట్లు కట్టిందని చెప్పారు.
కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించడం కోసం సుప్రీంకోర్టు సూచన మేరకు గవర్నర్ శుక్లాను సంప్రదిస్తామని సీఎం చెప్పారు. అజార్ మంత్రి పదవి చేపట్టి ఇంకా 6 నెలలు కాలేదని, ఈలోపు ఆయనకు ఎమ్మెల్సీపై నిర్ణయం జరిగిపోతుందని చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల వ్యవస్థను తొలగించాలంటే అంత ఈజీ కాదని, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడున్న జిల్లాలు, మండలాల్లో ప్రస్తుతానికైతే ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారు.
ప్రణాళికాబద్ధంగా మూసీ ప్రక్షాళన
మూసీ ప్రక్షాళన ప్రణాళికాబద్ధంగా చేస్తామని, డీపీఆర్ రాగానే అందుకు తగ్గట్టుగా పనులు ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మూసీ బాధితులను ఎలా ఆదుకోవాలో తమకు తెలుసని చెప్పారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం మేరకు ముందుకెళ్తామని తెలిపారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం వద్దని ఆయన మనవడు తుషార్ గాంధీ అనడంపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. ఆయన బీఆర్ఎస్ ట్రాప్‌లో పడ్డారని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేదని, మీడియాలో వచ్చే వార్తలపై తానేమీ స్పందించబోనని చెప్పారు.
జీవన్ రెడ్డి అంశాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చూసుకుంటున్నారని, తనకు సంబంధం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయం వచ్చినప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు. లోక్‌సభలో ఆ పదవి ఎంతో కాలంగా ఖాళీగానే ఉంటుందని, దాని గురించి అడగకుండా దీని గురించి అడగడం ఏంటని ప్రశ్నించారు.
‘ఆపరేషన్ కగార్’ కేంద్రం పరిధిలోనిది అని, తమకు సంబంధం లేదన్నారు. రాష్ట్రానికి చెందిన గణపతిని లొంగిపోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరామని, అంతకు మించి తామేం చేయలేమని తెలిపారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కపెట్టే వారు.. తాను ఎన్ని నిధులు తెచ్చానో కూడా లెక్కపెడితే బాగుంటుందని చురకలంటించారు.
