పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్​ను రద్దు చేస్తరా? : సీఎం రేవంత్ రెడ్డి

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్​ను రద్దు చేస్తరా? : సీఎం రేవంత్ రెడ్డి
  • వచ్చే వానాకాలం నుంచి వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇస్తం 
  • పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేండ్లు పక్కన పెట్టిన్రు 
  • పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తం.. పాలమూరు రుణం తీర్చుకుంటం 
  • కేసీఆర్​తో కొట్లాడ్తనన్న ఆర్ఎస్ ప్రవీణ్.. ఇప్పుడు ఆయన పంచనే చేరిండు 
  • ప్రజలు కేసీఆర్​ను బొందపెడితే.. ఈయన వెళ్లి పూలదండలు వేస్తున్నడు 
  • ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి 

మహబూబ్​నగర్/నాగర్​కర్నూల్/మద్దూరు, వెలుగు: పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని కేసీఆర్, హరీశ్ రావుకు ఆయన సవాల్ విసిరారు. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మద్దూరు, బిజినేపల్లిలో రేవంత్ పర్యటించారు. మద్దూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన కొడంగల్​ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబ్​నగర్ పార్లమెంట్ నియోజకవర్గ​ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్​రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

అనంతరం బావోజి జాతర సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి బిజినేపల్లికి వెళ్లి కాంగ్రెస్ నాగర్​కర్నూల్​పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్నారు. ఈ రెండు చోట్ల రేవంత్ మాట్లాడారు. ‘‘కేసీఆర్, హరీశ్​రావుకు ఇదే నా సవాల్! ఆరు నూరైనా.. అక్కడి సూరీడు ఇక్కడ ఉదయించినా.. జోగుళాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా.. ఆ రోజు నువ్వు, నీ మామ బీఆర్ఎస్​ పార్టీని రద్దు చేస్తారా? చేతనైతే సిద్ధంగా ఉండండి.. నా రాజీనామా కాదు.. నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు.. నీలాగో, నీ మామలాగానో దోఖేబాజ్ మాటలు మాట్లాడను.. లంగా, లఫంగా మాటలు చేప్పేటోన్ని కాదు.. రాసిపెట్టుకో.. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా.. రైతుల రుణం తీర్చుకుంటా’’ అని అన్నారు. 

‘‘ఆనాడు రైతులు వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అంటే..​ మరి ఆయన ఫామ్​హౌస్​లో మాత్రం 150 ఎకరాల్లో ఎందుకు వరివేశాడో చెప్పాలని నేను నిలదీసిన. కేసీఆర్​చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండదు. ఇంకో సవాల్​కూడా విసురుతున్నా. వానాకాలం పంటకు రూ.500 బోనస్​ఇచ్చి ప్రతి గింజనూ కొంటాం. దమ్ముంటే ఈ రెండు సవాళ్లను కేసీఆర్, హరీశ్ రావు స్వీకరించాలి’ అని సీఎం రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు. 

పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తం.. 

ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గతంలో కాంగ్రెస్​ప్రభుత్వం మొదలు పెట్టిన స్కీములను కేసీఆర్​ఆగం పట్టించారని రేవంత్​ఫైర్​అయ్యారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. కుర్చీ వేసుకుని మరీ తుమ్మిళ్లను పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్​.. ఫామ్ హౌస్​లో పడుకొని దాన్ని ఆగం పట్టించిండు. 70 ఏండ్లయినా పాలమూరు కరువు పోలె.. వలసలు ఆగలె.. బీళ్లు తడవలె. ఉమ్మడి రాష్ర్టంలో కల్వకుర్తి ఎట్లుందో అట్లనే ఉంది. ఆర్డీఎస్​పరిస్థితీ అదే. సంగంబండలో బండ పగలగొట్టడానికి పది కోట్లు ఉంటే చాలు.

కానీ 40 ఏండ్లు నానబెట్టిన్రు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే బండ పగలగొట్టడానికి డబ్బులు ఇచ్చిన. 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నం’’ అని చెప్పారు. రెండు టీఎంసీలతో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్.. దాన్ని​ఒక టీఎంసీకి కుదించారని మండిపడ్డారు. ‘‘పాలమూరు ప్రాజెక్టును రెండు టీఎంసీలతో పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంట. వేల కోట్లు ఖర్చయినా ఈ జిల్లాకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంట. పెండింగ్​ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులిచ్చి పూర్తి చేస్తా. పాలమూరు రుణం తీర్చుకుంట” అని అన్నారు. 

డీకే అరుణ, ఆర్ఎస్పీతో నాకేం పంచాది..

70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డకు అధికారం వస్తే మనవాళ్లే పగోడి చేతిలో కత్తిలా మారి మనల్నే పొడుస్తున్నారని రేవంత్ అన్నారు. శత్రువులకు సహకరించి వారికి సద్దులు మోస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రేవంత్​రెడ్డి తిడుతున్నడని, మా మీద కోపం పెంచుకున్నడని కొందరు అంటున్నరు.  

నేనో పీసీసీ అధ్యక్షుడిని, రాష్ర్టానికి ముఖ్యమంత్రిని. నాకెవరి మీద కోపం లేదు. నాకు డీకే అరుణ, ఆర్ఎస్​ప్రవీణ్ తో ఏం పోటీ? గెట్టు తగాదా ఉందా? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో బీజేపీ క్యాండిడేట్​కు డిపాజిట్ గల్లతైంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రవీణ్​కుమార్ ను కేసీఆర్ ఇబ్బంది పెడితే ఆయనకు మద్దతుగా నిలిచాం. రాజీనామా చేసినప్పుడు బాధపడ్డాం. దొరలకు వ్యతిరేకంగా కొట్లాడాలని ఆహ్వానించాం. డీజీపీ అయ్యే అకాశం ఉన్నా.. రాజీనామా చేసి దొరల పెత్తనం సహించేది లేదు.. గడీలను కూలుస్తానని ఆయనే ప్రజలకు చెప్పారు.

మరి ఆరు నెలల్లో ఏం మారింది. కేసీఆర్​ను ఏం చూసి నమ్మారు. కేసీఆర్​కు వ్యతిరేకంగా కొట్లాడాలంటే బీఎస్పీ పర్వాలేదు. కాంగ్రెస్​తో కొట్లాడొచ్చు. కానీ బీఆర్ఎస్​లో ఎందుకు చేరారు? ఎవరికైతే వ్యతిరేకంగా రాజీనామా చేశారో.. ఎవరినైతే నాలుగు కోట్ల ప్రజలు తిరస్కరించి వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టారో వాళ్ల పంచన చేరి, వారి వద్దకు పోయి పూలదండలు వేస్తున్నడు. సమాధిలో పాతుకుపోయిన కేసీఆర్​ను భూజాల మీద మోస్కోని తిరుగుతున్నడు. కేసీఆర్​కు ఎందుకు మద్దతు పలుకుతున్నాడో ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ సమాధానం చెప్పాలె.

వర్గీకరణకు వ్యతిరేకి అయిన కేసీఆర్​ పంచన చేరడమంటే నువ్వు కూడా వర్గీకరణకు వ్యతిరేకమన్నట్టేనా?’’ అని ప్రశ్నిచారు. ‘‘బీజేపీ ఎంపీ రాములుకు ‘సన్’ స్ర్టోక్ వచ్చింది. రాములును ఆయన కొడుకే ఇంట్లో వేసి తాళమేసిండు. బీజేపీ టికెట్​ తెచ్చుకున్నాడు. ప్రవీణ్, భరత్​ల పరిస్థితి ఎట్లుందంటే ‘ఎల్లయ్యకు ఎద్దులు లేవంటా.. మల్లయ్యకు బండి లేదంటా.. ఇద్దరు కలిసి సిర్సనగండ్ల జాతర పోతరంటా..’ అన్నట్టు ఉంది” అని ఎద్దేవా చేశారు. 

పాలమూరును బంగారు నేలగా మార్చుకుందాం..

పాలమూరు జిల్లాను బంగారు నేలగా మార్చుకునే అవకాశం వచ్చిందని రేవంత్ అన్నారు. ఇందుకు పార్టీలకు అతీతంగా కార్యకర్తలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లీడర్లు చెప్పే మాటలు విని జిల్లాను ఆగం చేయవద్దని కోరారు. ‘‘ఇది మీకు వచ్చిన అవకాశం. పసిడి పంటలు పండించుకునే పాలమూరు జిల్లాను బంగారు నేలగా మార్చుకుందాం. వంశీచంద్​రెడ్డి, మల్లు రవిని గెలిపించండి. ఢిల్లీలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. వర్గీకకరణ కోసం మల్లు రవి కంకణ బద్ధుడై ఉన్నాడు. ముదిరాజులను బీసీ-–డీ నుంచి బీసీ-–ఏలోకి మార్చడానికి వంశీచంద్ రెడ్డి కొట్లాడుతడు. ఇద్దరినీ గెలిపించాలి.

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత నాది. ప్రవీణ్ వస్తే కేసీఆర్​మాట వింటడు. డీకే అరుణ వస్తే మోదీ చేతల్లో ఉంటరు. వంశీ, రవి వస్తే సోనియా మాట వింటారు. నాకు సహకారం ఇస్తరు. వీళ్లిద్దరినీ గెలిపించుకుంటే పాలమూరు గొంతుక పార్లమెంట్​లో వినిపిస్తారు’’ అని అన్నారు. సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్లానింగ్​కమిషన్​వైస్​చైర్మన్​జిల్లెల చిన్నారెడ్డి, ప్రొఫెసర్​  కోదండరాం, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్​ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్​పర్సర్​సరిత, ఎస్ఏ సంపత్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు. 

ఆర్ఎస్ ప్రవీణ్​కు టీఎస్ పీఎస్సీ చైర్మన్ పోస్టు ఇస్తానంటే వద్దన్నడు.. 

ఆర్ఎస్​ ప్రవీణ్​ను టీఎస్​పీఎస్సీ చైర్మన్ చేయాలనుకున్నామని.. కానీ, అందుకు ఆయన ఒప్పుకోలేదని రేవంత్ తెలిపారు. ‘‘ఆర్ఎస్ ​ప్రవీణ్ పదవికి రాజీనామా చేయకుండా ఉండుంటే డీజీపీగా చేసేవాణ్ని. రాష్ట్రంలో కాంగ్రెస్ ​అధికారంలోకి వచ్చాక టీఎస్​పీఎస్సీలో 30 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నరు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నరు. టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా ఆర్ఎస్​ ప్రవీణ్​ను చేద్దామని అనుకున్నం. దీనిపై అప్పట్లో ప్రవీణ్​తో మాట్లాడితే ఒప్పుకోలేదు. పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా ఉంటే న్యాయం జరగుతుందని ఆలోచించిన. కానీ ఆయన తిరస్కరించి దొర గడీల దగ్గర కాపాలాగా నిలబడ్డడు. ప్రవీణ్ కుమార్​కు ఓటు వేస్తే.. మీరు బొందపెట్టిన కేసీఆర్​కు పోతుంది. ప్రవీణ్​​కు ఓటు వేస్తే దాన్ని మోదీకి కేసీఆర్ అమ్ము కుంటడు. కేసీఆర్ పదేండ్లుగా ఢిల్లీలో మోదీకే మద్దుతు ఇస్తున్నడు’’ అని మండిపడ్డారు.

డబుల్ ఇండ్లు ఏమైనయ్?

కరీంనగర్ ​నుంచి పాలమూరుకు వలస వస్తే ఇక్కడి ప్రజలు కేసీఆర్​ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్​కు పంపారని రేవంత్​గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ ఇస్తే.. తానే రాష్ట్రాన్ని సాధించానని కేసీఆర్ చెప్పుకున్నారు. కానీ, తెలంగాణ వచ్చాక కూడా పాలమూరుకు కేసీఆర్​ ఎందుకు అన్యాయం చేసిండో ప్రజలకు సమాధానం చెప్పాలి. కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ఆలంపూర్​ ముగినిపోతే.. హైదరాబాద్​లోని తన ఇంటిని అమ్మి అయినా బాధితులకు డబుల్ ​బెడ్రూం ​ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ ​హామీ ఇచ్చారు. పదేండ్లయినా బాధితులకు డబుల్ ​బెడ్రూం​ఇండ్లు మంజూరు చేయలేదు” అని సీఎం రేవంత్​ మండిపడ్డారు.  

పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. కుర్చీ వేసుకుని మరీ తుమ్మిళ్లను పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్​.. ఫామ్ హౌస్​లో పడుకొని దాన్ని ఆగం పట్టించిండు. 70 ఏండ్లయినా పాలమూరు కరువు పోలె.. వలసలు ఆగలె.. బీళ్లు తడవలె. ఉమ్మడి రాష్ట్రంలో కల్వకుర్తి ఎట్లుందో అట్లనే ఉంది. ఆర్డీఎస్​పరిస్థితీ అదే.