
శుక్రవారం ( సెప్టెంబర్ 5 ) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. తెలంగాణలో గురుపూజోత్సవం జరిగితే గతంలో సీఎం వచ్చారా..? అసలు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిందా..? కానీ.. ఇప్పుడు సీఎంగా తాను వచ్చానని అన్నారు. కాంట్రవర్సీ అయినా పర్వాలేదు విద్యాశాఖ తనదగ్గరే ఉదనాలని అనుకున్నానని అన్నారు సీఎం రేవంత్.
సాధారణంగా ముఖ్యమంత్రులు ఫైనాన్స్ , ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను తమ దగ్గర పెట్టుకుంటారని.. అత్యంత ప్రాధాన్యతతో కూడిన విద్యా శాఖను తన దగ్గర పెట్టుకున్నానని అన్నారు. విద్యా శాఖ బాగుపడొద్దనే ఉద్దేశంతో కొంత మంది విద్యా శాఖకు మంత్రినీ ఏర్పాటు చేయాలాంటున్నారని... సీఎం విద్యా శాఖ చూస్తే విద్యా శాఖ ప్రక్షాళన జరుగుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పరిపాలనలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉంటారని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా టీచర్ల సమస్యలు అలాగే ఉండిపోయాయని అన్నారు సీఎం రేవంత్.
మూడు లక్షల కోట్ల బడ్జెట్ అన్న గత పాలకులు నాణ్యమైన భోజనం అందించలేకపోయారని.. విద్యా శాఖ మీద ఆధిపత్యం చెలాయించాలని గత పాలకులు భావించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలు మూత పడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. గురుపూజోత్సవ కార్యక్రమానికి గత సీఎం ఎప్పుడైనా వచ్చారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గిపోవడానికి బాధ్యత సీఎంగా తనది, ఉపాధ్యాయులదే అని అన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక సదుపాయాల నిర్వహణ చేస్తున్నామని.. డైట్ ఛార్జీలు పెరిగి, సన్నం బియ్యం ఇచ్చినా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఉపాధ్యాయులు సైతం భోజనం చేయాలని.. అప్పుడే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగిపోతాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్. విదేశాలకు ప్రభుత్వ టీచర్లను పంపిస్తామని.. అభివృద్ధి చెందిన దేశాలలో అందిస్తున్న విద్యను అధ్యయనం చేయడానికి విదేశాలకు పంపిస్తామని అన్నారు. ప్రతి ఏడాది 200 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తామని.. అక్కడ అందుతున్న విద్యను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని అన్నారు.