ఆ తల్లుల దయతోనే ‘ప్రజా ప్రభుత్వం’...వారి స్ఫూర్తితోనే అభివృద్ధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆ తల్లుల దయతోనే ‘ప్రజా ప్రభుత్వం’...వారి స్ఫూర్తితోనే అభివృద్ధి:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  •     జనం కోసం ప్రాణాలిచ్చే తత్వమే మాకు మార్గదర్శకం
  •     భక్తులకు ఇబ్బంది లేకుండా చూడండి
  •     అధికారులకు సీఎం దిశానిర్దేశం
  •     రాష్ట్ర ప్రజలకు మేడారం జాతర విషెస్‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సూచించారు. గిరిజన, ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారనే అంచనాలు ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తిశ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు. 

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు సహకరించాలని కోరారు.  పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా మహా జాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు నాలుగు రోజుల పాటు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేశారు. ఈ  సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క, సారలమ్మ జాతర  శుభాకాంక్షలు తెలిపారు. 

మేడారం తల్లుల స్ఫూర్తితో ప్రజాస్వామ్య పోరాటం

మేడారం తల్లుల స్ఫూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగానే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తల్లుల చెంత ప్రజా ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్​సమావేశం నిర్వహించిందని అన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తిగా రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని అన్నారు.  నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.  

చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించిందని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. 

గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలు దిశలా తోరణాలను నిర్మించినట్లు గుర్తు చేశారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు,  ఆదివాసీల ఆచారాల పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని అన్నారు.