పాశమైలారం ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్ర్భాంతి

పాశమైలారం ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్ర్భాంతి
  • ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్ష
  • మంత్రులు వివేక్​, దామోదర నుంచి వివరాలు సేకరణ
  • సహాయ చర్యలు, భవిష్యత్ కార్యాచరణ సిఫార్సులకు కమిటీ  
  • నేడు ప్రమాద స్థలికి వెళ్లనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్​, వెలుగు: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్​రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయ చర్యలను ఆయన ఎప్పటికప్పుడు అక్కడున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలపై డీజీపీ, సీఎస్​తో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సహాయ చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్​ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ స్పెషల్​ సీఎస్​, లేబర్​ డిపార్ట్​మెంట్ పీఎస్​, హెల్త్ సెక్రటరీ, ఫైర్​సర్వీసెస్​ అడిషనల్​ డీజీని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మి కుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం  రేవంత్ రెడ్డి పాశమైలారంలోని ప్రమాద స్థలికి వెళ్లనున్నారు.