ముందు కేసీఆర్‎ను అరెస్ట్ చేసి.. తర్వాత మాకు సలహాలు ఇవ్వండి: బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్

ముందు కేసీఆర్‎ను అరెస్ట్ చేసి.. తర్వాత మాకు సలహాలు ఇవ్వండి: బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్

హైదరాబాద్: బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం (మార్చి 29) అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు వచ్చి ఇదే విషయం చెప్పారని.. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని అన్నారని గుర్తు చేశారు.

 కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటామన్న బీజేపీ సూచనల మేరకు కాళేశ్వరం అక్రమాల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించామని తెలిపారు. పారదర్శకత కోసమే కేసును సీబీఐకి అప్పగించామని తెలిపారు. 48 గంటల్లో యాక్షన్ తీసుకుంటామన్నారు.. 48 గంటలు కాదు కదా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. 

బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాళేశ్వరం విచారణ ముందుకు సాగనీయడం లేదని అన్నారు. సభలో సూచనలు ఇవ్వడం ఆ తర్వాత పారిపోవడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అవకతవకల కేసులో కేంద్రం కేసీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేసి ఆ తర్వాత బీజేపీ మాకు సలహాలు, సూచనలు ఇస్తే పాటిస్తామని చురకలటించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. 

హరీష్ రావు సిద్ధమా..?

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లో హరీష్ రావు ఫ్యామిలీ వందల కోట్ల భూమిని కబ్జా పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకుని భూమి బదలాయించుకున్నారని అన్నారు. హరీష్ రావు ఫ్యామిలీ భూకబ్జాలపై హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నాం.. నిజంగా హరీష్ రావు నిజాయితీ పరుడని కేటీఆర్ నమ్మితే హౌజ్ కమిటీ ముందుకు రావాలని డిమాండ్ చేశారు. తన ఫ్యామిలీ భూబదలాయింపు దోపిడీపై హౌస్ కమిటీ విచారణకు హరీష్ రావు సిద్ధమా అని సవాల్ విసిరారు.