Telangana Assembly: వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది బీఆర్ఎస్ నేతలే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్

Telangana Assembly: వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది బీఆర్ఎస్ నేతలే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్

హైదరాబాద్: చంద్రబాబు, వైఎస్ పంచన చేరి బీఆర్ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది బీఆర్ఎస్ నేతలే అని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్పై వాడీవేడీ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. భద్రాద్రి పవర్ ప్లాంట్లో రూ.2 వేల కోట్ల దోపిడి జరిగిందని, యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో రూ.10 వేల కోట్ల దోపిడికి బీఆర్ఎస్ పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న భద్రాద్రి ప్లాంట్ను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పూర్తి చేసిందని, ఆలస్యం కావడంతో ప్లాంట్ వ్యయం పెరిగిందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఖర్చును భారీగా పెంచారని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి కావడానికి మరో 2 ఏళ్లు పడుతుందని, 25 వేల కోట్ల వ్యయం 40 వేల కోట్లకు పెరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

NTPC ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని పునర్విభజన చట్టంలో ఉందని, NTPC కంటే యాదాద్రి, భద్రాద్రిలో పవర్ ఉత్పత్తికి ఖర్చు ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాత్రికి రాత్రే కిషన్ రెడ్డి, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు దోస్తులయ్యారని, బీఆర్ఎస్ నేతలు బ్రహ్మం గారి ముత్తాతలని సీఎం ఎద్దేవా చేశారు. ఇండియా బుల్స్ దగ్గర బీఆర్ఎస్ నేతలు కమీషన్లు కొట్టేశారని, 2015న చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి జగదీశ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. కోర్టును తప్పుబట్టించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలన్న కేసీఆర్ వాదనను సుప్రీం తిరస్కరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.