- నియోజకవర్గానికి తొలిసారి సీఎం రేవంత్‌రెడ్డి
- రూ.600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- కాంగ్రెస్ క్యాడర్లో నూతనోత్సాహం
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, కాంగ్రెస్శ్రేణులు పెద్ద సంఖ్యలో రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 3.27 నిమిషాలకు నర్సంపేట చేరుకుని, అక్కడి నుంచి కాన్వాయి ద్వారా మెడికల్ కాలేజీకి వెళ్లారు. మెడికల్ కాలేజీ బిల్డింగ్, నర్సింగ్, ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సుమారు రూ. 600 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం సభా వేదికపైకి చేరుకున్నారు. తొలిసారిగా నర్సంపేటకు సీఎం రావడంతో జనం కేరింతలు కొడుతూ వెల్కం పలికారు. ఎమ్మెల్యే దొంతిని ఆలింగనం చేసుకుని మాధవన్నకు అండగా ఉండాలని, మాధవన్న సైన్యం అంటూ సంబోధించడంతో సభ హర్షధ్వానాలతో హోరెత్తిపోయింది.
దారులన్నీ నర్సంపేట వైపే..
నర్సంపేటలో సీఎం సభకు పార్టీ నాయకుల అంచనాలకు మించి జనం రావడం కనిపించింది. నియోజకవర్గంలోని ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఆటోల్లో జనం భారీగా తరలివచ్చారు. మహబూబాబాద్, ములుగు, వరంగల్ నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ నాయకులు వచ్చారు. సభా ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల ముందే వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయడంతో ఆయా పార్కింగ్ స్థలాల నుంచి జనం నడుచుకుంటూ సభకు చేరుకున్నారు. రోడ్లన్నీ సభకు వచ్చిన వారితో కిక్కిరిశాయి. డ్యాన్సులతో పార్టీ కార్యకర్తలు హోరెత్తించారు.
హాజరైన ప్రజాప్రతినిధులు..
నర్సంపేట సీఎం సభకు ముగ్గురు మంత్రులతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీపాల్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంక్రటాంరెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ల చైర్మన్లు సిరిసిల్ల రాజయ్య, రియాజ్ తరలివచ్చారు.
15 ఏండ్లు రేవంత్‌రెడ్డే సీఎం..
తెలంగాణ రాష్ర్టానికి రాబోయే 15 ఏండ్లు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ స్పష్టం చేశారు. నర్సంపేట సభలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం కోసం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు.
నర్సంపేటకు వరాలజల్లులే..
ఇందిరమ్మ పాలనతోనే పేదల జీవితాలు బాగుపడుతాయని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట సభలో ఆయన మాట్లాడుతూ ఇక నర్సంపేట నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీవోలు, అనుమతులు వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం వచ్చిందని, ఈరోజు రూ.600 కోట్ల పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారని చెప్పారు. మరో 3,500 ఇందిరమ్మ ఇండ్లు సైతం వచ్చే ఏప్రిల్‌లో మంజూరు కానున్నాయని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
మార్చి 31లోపు ఎయిర్ పోర్ట్ పనులకు శ్రీకారం..
ఓరుగల్లులో వచ్చే మార్చి 31 లోపు మామునూరు ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏండ్లలో కనీసం మరో ఎయిర్ పోర్ట్ తీసుకురాకుండా అసమర్ధంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ స్థాయిలోనే వరంగల్ ను సైతం అభివృద్ధి చేసేందుకు రెడీగా ఉందన్నారు. ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి ప్రాజెక్టులను వరంగల్లోనూ చేపడుతుందన్నారు.
