ఆర్టీసీ కార్మికులకు రూ. 281 కోట్లు... 100 కొత్త బస్సులు

 ఆర్టీసీ కార్మికులకు  రూ. 281 కోట్లు...  100 కొత్త బస్సులు

 

  • ఆర్టీసీ కార్మికులకు  రూ. 281 కోట్లు...  100 కొత్త బస్సులు 
  • బకాయిలు విడుదల చేస్తామని రేవంత్ ప్రకటన 
  •     మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీ బలోపేతమైందన్న సీఎం
  •     100 కొత్త బస్సులు ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 2013 నాటి పీఆర్సీ బకాయిలు రూ.281 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా బకాయిలు విడుదల చేస్తున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 100 కొత్త బస్సులను రేవంత్ ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మహాలక్ష్మి స్కీమ్​లో భాగంగా 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ చేసిన సందర్భంగా ప్రత్యేక సావనీర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బలోపేతానికి మహాలక్ష్మి స్కీమ్ ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. ఈ స్కీమ్ కోసం నెలనెలా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నామని తెలిపారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది. తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కార్మికులు భావించారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే ఉక్కుపాదంతో అణిచివేశారు. 36 మంది కార్మికులు మరణించినా పట్టించుకోలేదు” అని సీఎం రేవంత్​ రెడ్డి  మండిపడ్డారు. కొత్త బస్సులు మహాలక్ష్మి స్కీమ్ రద్దీని తగ్గించడంతో పాటు మేడారం జాతరకు ఉపయోగపడతాయని చెప్పారు. మరో 1,300 కొత్త బస్సులు కొనేందుకు నిధులు ఇవ్వాలని ఎండీ సజ్జనార్ అడిగారని పేర్కొన్నారు. కాగా, కొత్త బస్సులో సీఎం, మంత్రులు కొద్ది దూరం ప్రయాణించారు.  

గత ప్రభుత్వం ఆర్టీసీని పట్టించుకోలేదు: భట్టి 

ఆర్టీసీ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆర్టీసీకి నష్టాలు వచ్చాయి. మా ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బలోపేతమైంది. ఆక్యుపెన్సీ రేషియో, రద్దీ పెరిగింది. మహాలక్ష్మి స్కీమ్ సబ్సిడీ నిధులను ఎప్పటికప్పుడు ఆర్టీసీకి విడుదల చేస్తాం” అని చెప్పారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసింది. కార్మికుల హక్కులను కాలరాసింది. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ ఉంటుందా? ఎత్తేస్తారా? అనే పరిస్థితి ఉండేది” అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘‘ఉద్యమంలో పోరాడిన ఆర్టీసీ కార్మికులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ తన బంధువు అయిన రిటైర్డ్ అధికారిని ఆర్టీసీ ఎండీగా నాలుగేండ్లు కొనసాగించారు. ఆర్టీసీని నిర్వీర్యం చేశారు” అని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 100 బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ‘‘ప్రస్తుతం ఆర్టీసీకి రూ.650 కోట్ల నష్టం ఉంది. దాన్ని ఈ ఏడాది నవంబర్ నాటికి రూ.105 కోట్లకు తగ్గించుకుంటాం. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తాం” అని చెప్పారు.

ఆర్టీసీకి 4 వేల కోట్లు

మహాలక్ష్మి స్కీమ్​కు ప్రతి నెలా రూ.300 కోట్లు

ఆర్టీసీకి ప్రభుత్వం బడ్జెట్ లో రూ.4 వేల కోట్లు కేటాయించింది. ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయించిన సర్కారు.. మహాలక్ష్మి స్కీమ్​ను కూడా అందులోనే చూపించింది. అందులో ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు రానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్​ను డిసెంబర్ 9, 2023న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 16 కోట్లకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేశారని  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాగా, ఇది 3 నెలల బడ్జెట్ అని, కార్మికుల బకాయిలపై క్లారిటీ ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే, కార్మికులకు పెండింగ్​లో ఉన్న 2013 పీఆర్సీ 50% బకాయిలను ఇస్తున్నట్లు బస్సుల ఓపెనింగ్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి  పొన్నం ప్రభాకర్​కు యూనియన్ నేతలు అశ్వత్థామరెడ్డి, హనుమంతు ముదిరాజ్, థామస్ రెడ్డి, రాజిరెడ్డి, కమాల్ రెడ్డి, నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయాలని నేతలు కోరారు.