- గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముందుకెళ్లాలి
- మన సర్కార్ ఎజెండానూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం
- రెండు, మూడ్రోజుల్లో పీఎస్‌ల నియామకం
హైదరాబాద్, వెలుగు : వివిధ శాఖల రివ్యూలు, కార్యక్రమాలు, పర్యటనలతో ఇన్ని రోజులు బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇక రాష్ట్రంలో పాలనను పూర్తి స్థాయిలో సెట్ చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజలకు తెలియజేస్తూనే.. కాంగ్రెస్ సర్కార్ ఎజెండాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమైన ప్రభుత్వ శాఖలన్నింటికీ హెచ్వోడీలు, జిల్లాలకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని.. ఇక పాలనను గాడిలో పెట్టాలని సూచించారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలవుతుండగా, వచ్చే నెలలో మరో రెండు గ్యారంటీలను ప్రారంభించాలని నిర్ణయించారు.
‘‘మండలాలు, జిల్లా కేంద్రాల్లో పని చేసే ఆఫీసర్ల దగ్గరకు వచ్చే ప్రజలకు కొత్త ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనే భావన రాకుండా ముందుకెళ్లాలి. సీఎంవోలో అధికారులకు కేటాయించిన డిపార్ట్మెంట్ల ఫైల్స్ సర్క్యులేషన్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. ఫైల్స్ పెండింగ్ లేకుండా చూడాలి” అని రేవంత్ సూచించారు. పెండింగ్ సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లపైనా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
త్వరలో పీఎస్ ల నియామకం..
సీఎంతో పాటు మంత్రుల దగ్గర ఇంకా పర్సనల్ సెక్రటరీలు (పీఎస్ లు), అడిషనల్ పీఎస్‌లు, పీఆర్వోలు, ఓఎస్డీల నియమాకం జరగలేదు. దాదాపు అందరూ రేపోమాపో ఆర్డర్స్వస్తాయనే భావనలో పని చేస్తున్నారు. దీంతో మంత్రుల దగ్గరకు వచ్చే వివిధ రకాల పిటిషన్లను అడ్రస్ చేసే సిస్టమ్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో పీఎస్‌లకు సంబంధించిన ఆర్డర్స్పూర్తి చేయాలని సంబంధిత ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. కాగా, పోయినేడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకే మహలక్ష్మి పథకం, రాజీవ్‌ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంపును అమల్లోకి తెచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ శాఖపై శ్వేతపత్రాలు రిలీజ్చేశారు. ‘ప్రజాపాలన’ పేరుతో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీల అమలు కోసం అప్లికేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో రోజూ ఒకట్రెండు డిపార్ట్మెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి.. ఆయా శాఖల పనితీరు, వివరాలను తెలుసుకున్నారు. ఇటీవల దావోస్, లండన్ పర్యటనకు వెళ్లొచ్చారు.
