మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్​రెడ్డి

మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్​రెడ్డి
  • బీజేపీకి ఓటేస్తే జరిగేది ఇదే
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి : సీఎం 
  • రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది
  • ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తమని గద్దెనెక్కిన మోదీ.. ఇచ్చిన జాబ్స్​ ఎన్ని?
  • 14 మంది ప్రధానులు రూ. 55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కడే చేసిన అప్పు 113 లక్షల కోట్లు
  • నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచిండు.. అగర్​బత్తీలపైనా జీఎస్టీ వేస్తుండు
  • కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది 
  • కేంద్రంలో పవర్​లోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన
  • బీజేపీపై ‘పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం’ పేరిట చార్జ్​షీట్​ రిలీజ్​

హైదరాబాద్, వెలుగు : దేశంలో నరేంద్రమోదీ మళ్లీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారని..  బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దును సపోర్టు చేసినట్లవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోక్​సభ ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా.. వద్దా.. అనే రెఫరెండంతోనే జరుగుతున్నాయని తెలిపారు. ‘‘2025 నాటికి రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ ఎజెండా. దాన్ని అమలు చేయడమే మోదీ ప్లాన్. బీజేపీకి ఓటు వేసేముందు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఆలోచించాలి” అని ఆయన అన్నారు.

కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పారు. ‘పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం’ పేరిట బీజేపీపై చార్జ్​షీట్​ను గురువారం గాంధీ భవన్​లో సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. ‘‘1925లో మొదలైన ఆర్ఎస్ఎస్ వందేండ్లలో రిజర్వేషన్లను రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది 2025తో అది పూర్తవుతుంది. ఆ ఎజెండాను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుందని, ఇందుకోసం మోదీకి మూడింట రెండు వంతుల మెజార్టీ కావాలని, అందుకే ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు” అని అన్నారు. 

రాజ్యాంగంపై బీజేపీ కుట్రలు

అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఇలాంటి బీజేపీకి వర్గీకరణ కోసం పోరాడేవాళ్లు కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదని, అలాంటి వాళ్లు ఒకసారి ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. ‘‘స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి పేదల ఖాతాల్లో వేస్తానని జన్ ధన్ ఖాతాలు తెరిపించిన మోదీ.. ఇప్పటి వరకు రూపాయి కూడా వేయలేదు. ఏటా 2 కోట్ల కొలువులిస్తామని చెప్పి గద్దెనెక్కిన మోదీ.. ఇప్పటి వరకు పదేండ్లలో  ఇవ్వాల్సింది 20 కోట్ల ఉద్యోగాలు.

కానీ, ఇచ్చింది 7 లక్షల 21 వేల 687 ఉద్యోగాలు మాత్రమే. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అన్నదాతలను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చేందుకు మోదీ ప్రయత్నించిండు. దీంతో లక్షలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడిస్తే ఆందోళనలకు తలొగ్గి క్షమాపణలు చెప్పి, చట్టాలను వెనక్కి తీసుకున్నడు” అని ఆయన తెలిపారు. దేవుడి దగ్గర వెలిగించే అగర్ బత్తీలపై కూడా మోదీ సర్కార్  జీఎస్టీ విధించిందని మండిపడ్డారు. 410 రూపాయలున్న సిలిండర్ ధర రూ. 1,200 కు పెరిగిందని,  55 రూపాయలున్న పెట్రోల్ రూ. 110 అయిందని, 80 రూపాయలున్న మంచి నూనె రూ.180కి ఎగబాకిందని

ఇదీ మోదీ పాలన అని విమర్శించారు. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిన్రు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. మోదీకి కాదేదీ జీఎస్టీకి అనర్హం” అని విమర్శించారు. 1947 నుంచి 14 మంది ప్రధానమంత్రులు దేశాన్ని ఏలారని, అందరూ కలిసి రూ. 55 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్రమోదీ ఒక్కరే రూ. 113 లక్షల కోట్ల అప్పు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం రూ. 168 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. పదేండ్ల మోదీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్తేనే భవిష్యత్తు ఉంటుందని, లేకుంటే ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. 

‘నయవంచన’ పేరుతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు​

పదేండ్ల మోదీ పాలనపై ‘నయవంచన’ పేరిట గాంధీ భవన్ వద్ద భారీ ఫ్లెక్సీని కాంగ్రెస్​ నేతలు ఏర్పాటు చేశారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను కార్టూన్లతో వివరించారు. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని, బ్లాక్ మనీని తుడిచి పారేస్తామంటూ చెప్పిన హామీ ఏమైందని అందులో ప్రశ్నించారు. తెలంగాణ నుంచి రూపాయి పంపిస్తే 43 పైసలు బిచ్చంగా ఇచ్చారని విమర్శించారు. కృష్ణా నదిలో ఆంధ్రకే ఎక్కువ వాటా ఇచ్చారని, తెలంగాణకు ఒక్క విద్యాలయం కూడా ఇవ్వలేదని ఫ్లెక్సీలో ప్రస్తావించారు. 

బీజేపీవి మోసపూరిత హామీలు : భట్టి విక్రమార్క

‘‘కొద్ది మంది తన స్నేహితులు, కుహానా పెట్టుబడిదారులకు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. జనాభాను కులాలు, మతాలుగా విభజించి మతకల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం దాడి చేసి సంపదను దోచుకునేవని, ప్రస్తుతం ఈ దేశంలో మోదీ హయాంలో ఇదే రకమైన ధోరణి కనిపిస్తున్నదన్నారు.  ‘‘పదేండ్లుగా ఈ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నదో చూశాం.

ఎంపీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ మోసపూరిత హామీలు ఇస్తున్నది. అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ.. పదేండ్లలో ఆ హామీని అమలు చేయలేదు. నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేదల అకౌంట్లలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానని చెప్పి మోసం చేశారు” అని ఆయన మండిపడ్డారు. మోదీ చేస్తున్న మోసాలను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్​గాంధీ పాదయాత్ర చేపట్టి దేశ ప్రజలకు వివరించారని అన్నారు. రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని, ఈ దేశ సంపదను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారని ఆయన తెలిపారు. 

బీజేపీపై కాంగ్రెస్ రిలీజ్ చేసిన చార్జ్​షీట్​లోని ముఖ్యాంశాలు

  •     విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా మోదీ సర్కార్ అమలు చేయలేదు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీకల్చర్ వర్సిటీ వంటి హామీలను అమలు చేయలేదు. 
  •     పార్లమెంట్ సాక్షిగా మోదీ తెలంగాణ ఏర్పాటును హేళన చేశారు. 
  •     నిధుల విడుదలలో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపారు. తెలంగాణకు రావాల్సిన రూ. 4 వేల కోట్ల జీఎస్టీ పరిహారంతో పాటు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ. 24,205 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు రూ. 1,800 కోట్లను మోదీ సర్కార్ విడుదల చేయలేదు. 
  •     రైతులు, పేదలు, యువతకు మోదీ సర్కార్​ దోఖా చేసింది. 
  •     కృష్ణా జలాల్లో వాటాను తెలంగాణకు దక్కనీయలేదు. రైతులను ముంచారు. 
  •     2022 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పి.. తెలంగాణలో ఇండ్లే కట్టకుండా పేదలను మోదీ సర్కార్​ మోసం చేసింది. 
  •     పాలమూరు – రంగారెడ్డి సహా తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. 
  •     గతంలో కాంగ్రెస్ హయాంలో సింగరేణికి కేటాయించిన గనులను బీజేపీ ప్రైవేటీకరిస్తున్నది. 
  •     రాష్ట్రంలోని పలు రైల్వే లైన్ల నిర్మాణంలో కూడా మోదీ సర్కార్ విఫలమైంది. 
  •     తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటులో మోసం చేశారు. ఐఐఎం, ఐఐఐటీ, కేంద్ర యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలను మోదీ సర్కార్ ఇవ్వలేదు. 2014 నుంచి సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటులో తెలంగాణపై వివక్ష చూపారు. 
  •     మోదీ సర్కార్​ కేవలం పబ్లిసిటీ కోసమే రూ. 10 వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసింది. దాదాపుగా అన్ని ప్రింట్ అండ్ టీవీ మీడియా సంస్థలను కొనుగోలు చేసింది. 
  •     మోదీ సర్కార్​ రైతు రుణ మాఫీ చేయలేదు కాని, కార్పొరేట్లకు మాత్రం రూ. 25 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది. 
  •     బీజేపీ నిరంకుశ పాలనతో ఏడు రాష్ట్రాల్లోని ప్రజా ప్రభుత్వాలను కూల్చింది. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధించింది. 
  •     దేశ సార్వభౌమత్వానికి మోదీ భంగం కలిగించారు. 2 వేల చదరపు కిలో మీటర్లకు పైగా భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించింది.