
- అంటు వ్యాధులు ప్రబలకుండా చూసుకోండి: సీఎం రేవంత్ రెడ్డి
- అవసరమైన చోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయండి
- తగిన మందులు అందుబాటులో ఉంచుకోండి
- లోతట్టు ఏరియాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల ఆఫీసర్లు, స్టాఫ్ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరి కల నేపథ్యంలో శనివారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.
కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ‘‘నీటిపారుదల శాఖ అధికారులు.. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రమాదకరస్థాయిలో ఉన్న వాటి వద్ద ఇసుక బస్తాలు సిద్ధం చేసి, నీటి విడుదలకు సంబంధించి ముందుగానే క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీసు, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి” అని చెప్పారు.
అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని.. అవసరమైన చోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, తగిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్య శాఖను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలించాలని.. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లోలెవల్ బ్రిడ్జిలు, కాలువల మీదుగా రాకపోకలు పూర్తిగా నిషేధించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆయన అన్నారు.