సీఎం జాతర బహిరంగ సభ సక్సెస్ .. భారీగా తరలివచ్చిన జనం

సీఎం జాతర బహిరంగ సభ సక్సెస్ .. భారీగా తరలివచ్చిన జనం
  • తనదైన శైలిలో రేవంత్​రెడ్డి ప్రసంగం
  • హుషారులో కాంగ్రెస్ శ్రేణులు

ఆసిఫాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆసిఫాబాద్​లో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి జన జాతర బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనబడుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు.

 సభలో రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. అరగంటపాటు సాగిన రేవంత్ రెడ్డి ప్రసంగం సమయంలో ఈలలు, చప్పట్లతో జనం హోరెత్తించారు. పార్టీ శ్రేణులు జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రేవంత్ అంటూ నినాదాలు చేశారు. మండుటెండలోనూ రేవంత్ ప్రసంగం హుషారుగా సాగింది. సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ చేసిన మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, నాయకులు శ్యామ్ నాయక్ ,అనిల్ గౌడ్​ను సీఎం అభినందించారు.

ఆదిలాబాద్ అభివృద్ధి నా బాధ్యత

వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సాగునీటి సమస్య, పోడు భూములు, గిరిజనేతరులకు పహానీ, గిరిజనులకు పట్టాల సమస్యలు ఉన్నాయన్న సీఎం.. పదేండ్లు పాలించిన కేసీఆర్  వీటిపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ​ప్రభుత్వం వీటి సమస్యలు తీరుస్తుందని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్​కు ప్రత్యేక స్థానం ఉందని, జిల్లా అభివృద్ధి కోసం మంత్రి సీతక్క రోజూ 18 గంటలు కష్టపడుతోందన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కుమ్రం భీం ప్రాజెక్టు కెనాల్స్ కంప్లీట్ కాక నీళ్లున్నా పారడం లేదన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. మూడు నెలల్లో 30వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్లు పెంచుతమని చెప్తుంటే.. బీజేపీ రివర్స్ లో పోతోందని, పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లును తుంగలో తొక్కడం ఖాయమని అన్నారు. ‘మీ రిజర్వేషన్లు రద్దు చేసుకుంటారా, బీజేపీని రద్దు చేస్తారా ఆలోచించండి’ అన్ని పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానులు తెలంగాణ మీద దాడి చేయలనుకుంటున్నారని దీన్ని ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  

కొంగు చాచి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి: ఆత్రం సుగుణ

‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఆదిలాబాద్ పార్లమెంట్​కు ఇప్పటివరకు మహిళలకు ఛాన్స్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ పేదింటి ఆడబిడ్డ, ఆదివాసీ బిడ్డకు అవకాశం ఇచ్చింది. కొంగు చాచి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి. భారీ మెజార్టీతో గెలిపించాలి’ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సబ్బండ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఎం రేవంత్​రెడ్డికి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే ఇప్పటికే మూడుసార్లు వచ్చారని పేర్కొన్నారు.  జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అవకాశం ఇవ్వాలని కోరారు.

గోడం నగేశ్​కు ఒటేయొద్దు: బొజ్జు పటేల్

బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్​కు ఒక్కరు కూడా ఓటు వేయొద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కులాలు, మతాల పేరుతో ఓట్లు ఆడుతున్న నగేశ్.. ఆదివాసీ బిడ్డగా ఏనాడైన ఆదివాసీ దేవుళ్లు, సంప్రదాయం పాటించావా అని ప్రశ్నించారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన నగేశ్ ఏనాడూ ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. పదేండ్లు  దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 

కులాలు మతాల పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. హిందూ, ముస్లిం అంటూ మోదీ, అమిత్ షా ప్రజలను రెచ్చిగొడుతున్నారని ఫైర్ ​అయ్యారు. దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూం, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోసం చేసిన బీఆర్ఎస్​కు గుణపాఠం చెప్పాలన్నారు.