V6 News

తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ నా దగ్గర ఉంది: సీఎం రేవంత్

తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ నా దగ్గర ఉంది: సీఎం రేవంత్
  • అంతరాలు లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం
  • ఆ దిశలోనే ఇంటి గ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు
  • త్వరలోనే కాకతీయ యూనివర్సిటీకి వెళ్త
  • ఢిల్లీలో మీడియాతో చిట్​చాట్​లో వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: పరిపాలనకు చదువు ఒక్కటే ముఖ్యం కాదని.. ప్రజల మంచిని కోరే విజన్ ఉన్న నేత అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నేను 80 వేల పుస్తకాలు చదువలేదు. సమాజంలోని భిన్నవర్గాలు కోరుకుంటున్న ఆలోచనలు అర్థం చేసుకోగలను. ఒక రాజ్యానికి రాజైనా.. సీఎం అయినా.. కావాల్సింది విజన్” అని ఆయన పేర్కొన్నారు. ఆ విజన్ ను అమలు చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్​దని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన విజన్ తన దగ్గర ఉందని, ఆ విజన్ ను అమలు చేసేందుకు 300 మంది ఐఏఎస్ లు తన దగ్గర ఉన్నారని ఆయన చెప్పారు. 

గురువారం పార్లమెంట్ లోని క్యాంటీన్ లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఎలాంటి అంతరాలు లేని సమాజమే తన లక్ష్యమని ఆయన అన్నారు. వెనుకబాటుతనానికి చదువుతో, పేదరికానికి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉందని తెలిపారు. అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పేరిట పిల్లలను విద్యార్థి దశ నుంచే సమాజం నుంచి వెలివేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని పోగొట్టాలనేదే నా ఆలోచన. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను విజన్ లో భాగంగా తెచ్చాను’’ అని ఆయన వివరించారు.

దేశానికి కావాల్సింది నాణ్యమైన విద్య, పోషకాహారం..
స్వాతంత్ర్య సమయంలో దేశ ప్రజలకు విద్య, తినేందుకు ఆహారం లేదని.. కానీ, అభివృద్ధి చెందుతున్న భారత్​లో ప్రస్తుతం కావాల్సిన దానికంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతోందని.. అలాగే ప్రతి గ్రామంలో స్కూల్స్ ఉన్నాయని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. 

అయితే ప్రస్తుతం దేశ ప్రజలకు కావాల్సింది కేవలం ఆహారం, విద్య కాదని... నాణ్యమైన ఎడ్యుకేషన్, న్యూట్రీషియన్ ఫుడ్ (పోషకాహారం) అని చెప్పారు. పేదరికంలో ఉన్న ఎంతో మందికి పోషకాహారం దొరకడం లేదని, ఇంకా కొన్నివర్గాలు నాణ్యమైన విద్యను అందుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

త్వరలో కాకతీయ వర్సిటీని సందర్శిస్త..
రాష్ట్రంలో యూనివర్సిటీల అభివృద్ధిపై తాను ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. వర్సిటీలను కాపాడుకున్న రోజే రాష్ట్ర యువత భవిష్యత్తును తీర్చి దిద్దగలమన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ. 1,000 కోట్లు కేటాయించామని తెలిపారు. 

ఈ నిధుల వినియోగంలో ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉండదని.. విద్యార్థుల భవిష్యత్ కే ప్రాధాన్యం ఉంటుందన్నారు. తదుపరి తన ఫోకస్ కాకతీయ విశ్వవిద్యాలయమేనని.. త్వరలో ఆ యూనివర్సిటీని సందర్శిస్తానని ఆయన వెల్లడించారు. 

గ్లోబల్ సమిట్తో పునాది వేశాం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​తో పునాది వేశామని సీఎం రేవంత్​ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఒక గమ్య స్థానమనే విషయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పామని తెలిపారు. 

దాదాపు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు గ్లోబల్ సమిట్ సక్సెస్ కు నిదర్శనమని పేర్కొన్నారు. సమిట్​ను ఏటా నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. కాగా, మంత్రివర్గ విస్తరణ ఏమైనా ఉంటుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇప్పుడున్న మంత్రివర్గం సమర్థవంతంగానే ఉందని ఆయన తెలిపారు.