- 50 శాతం ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్
- నియోజకవర్గాల పునర్విభజన పార్టీల సమస్య కాదు.. అది సౌత్ ఇండియా సమస్య
- దీనిపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలి
- ఇక్కడి ప్రజల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలి..డీలిమిటేషన్‌పై విస్తృత చర్చ జరగాలి
- రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు
- రైతులు విచ్చలవిడిగా పెస్టిసైడ్స్, ఎరువులు వాడొద్దు
- పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలి
- కల్తీ ఫుడ్ కట్టడికి త్వరలో స్పెషల్ వింగ్
- కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు.. ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారని అనుమానం
- హరీశ్ కాలనాగు కన్నా ప్రమాదకరమని కామెంట్..మీడియాతో సీఎం చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: దేశంలో మెజార్టీ సీట్లను దక్కించుకొని అధికారాన్ని శాశ్వతం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ డీలిమిటేషన్ కుట్రకు తెరతీసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచాలనే ఫార్ములా నియంతృత్వ పాలనకు దారి తీస్తుందని, ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులాంటిదని పేర్కొన్నారు.
సోమవారం శాసన మండలిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియాకు తీరని అన్యాయం జరుగుతుంది.. ఈ పునర్విభజన రాజకీయ పార్టీల సమస్య కాదు.. సౌత్ ఇండియా సమస్య.. దీనిపై దక్షిణాది బీజేపీ నేతలు అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది’’ అని హితవు పలికారు.
పునర్విభజనపై బీజేపీ లక్ష్మణ్ వితండవాదం చేస్తున్నారని, సౌత్ ఇండియా ప్రజల ప్రయోజనాల కోసం ఆయన రాజీనామా చేయాలని సూచించారు. ‘‘రాజ కీయంగా మన అవసరం ఉన్నప్పుడే వాళ్లు సౌత్ ఇండియాను పట్టించుకోవడంలేదు.. అలాంటిది ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వారికి దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా పోతుంది.. దక్షిణాదిలో వాళ్లకు ఒక్క సీటు రాకున్నా.. కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చేసుకోవచ్చు.. దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చలాయించే ప్రమాదం ఉంది’’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
డీ లిమిటేషన్ జరిగితే ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుతం..
దేశాభివృద్ధిలో భాగమైన సౌత్ ఇండియా ప్రజలను కేంద్రం శిక్షించాలని చూస్తున్నదని, ఇది సరైన పద్ధతి కాదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. 50 శాతం ఫార్ములాతో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇక ఈ దేశంలో సౌత్ ఇండియా ప్రజలు రెండో శ్రేణి పౌరులుగా మారాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రాల సీట్ల మధ్య అంతరం అనేది పునర్విభజన తర్వాత కూడా అలాగే ఉండాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.
‘‘ఉదాహరణకు బీజేపీ చెప్తున్నట్టు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల(17)కు 50 శాతం సీట్ల (8)ను కలిపితే 25కు చేరుతాయి. యూపీలోని 80 సీట్లకు 40 సీట్లను కలిపితే 120కి చేరుతాయి. గతంలో ఈ రెండు రాష్ట్రాల నడుమ సీట్ల తేడా 63 ఉండగా, ఇకపై 95 సీట్ల వ్యత్యాసం ఉంటుంది. ఇది ప్రమాదకరం. అలా కాకుండా ఆయా రాష్ట్రాల మధ్య సీట్లలో తేడా రాకుండా చూడాలి. అంటే కొత్తగా పెంచే సీట్లు అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా ఉండాలి’’ అని సీఎం సూచించారు.
దీనిపై కేంద్రంలోని బీజేపీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. పార్టీలకతీతంగా కార్యాచరణ ఉండాలని, 50 శాతం సీట్ల పెంపుపై ప్రజల్లో ఇంకా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ జాతీయ నాయకత్వం ఆలోచనకు తగ్గట్టుగానే తాము ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆలోచనల ప్రకారమే సౌత్ ఇండియా విషయంలో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. ‘‘దేశంలో బ్రూటల్ మెజార్టీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సీట్ల విషయంలో ఆంధ్రాకు మెజార్టీ ఉండేది. అందుకే తెలంగాణ రాష్ట్రం అనివార్యం అయింది’’ అని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ టెస్టులు..
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ టెస్టులు చేయిస్తామని, ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో విచ్చలవిడిగా పెస్టిసైడ్స్, ఎరువులు వాడుతున్నారని, వీటి వల్ల జనం రోగాల బారిన పడ్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘పురుగుమందులు, ఎరువులు మోతాదు మించితే జనానికి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తాం. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లిస్తాం. ఈ విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురాం. వారికి అవగాహన కల్పిస్తాం’’ అని స్పష్టం చేశారు.
పేదలకు ఇచ్చే సన్న బియ్యం కోసం ఏటా రూ.14 ,560 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ప్రతి ఏడాది ఇలాగే ఖర్చు చేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ సన్న బియ్యానికి నిధుల కొరత రానియబోమని అన్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారని, తాము మాత్రం వరి వేస్తే బోనస్ ఇస్తున్నామని, ఇదే వారికి, తమకు ఉన్న తేడా అని రేవంత్ వివరించారు. తెలంగాణలో కల్తీ ఫుడ్ కట్టడికి స్పెషల్ వింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పుడు ఈగల్, హైడ్రా విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో.. రానున్న రోజుల్లో ఆహార కల్తీ కట్టడికి అలాంటి వ్యవస్థ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్ లేకపోతే నా మంచి తెలిసేది కాదు..
కేసీఆర్ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ గనుక లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదన్నారు. ‘‘రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది.. శకునుడి చెడు వల్లే శ్రీకృష్ణుడికి అంతటి పేరు వచ్చింది.. ఇప్పుడు కేసీఆర్ చేసిన చెడు పనుల వల్లే నేను చేస్తున్న మంచికి ఆదరణ లభిస్తున్నది’’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని కేటీఆర్, హరీశ్ అంటున్నా..అది నిజమని నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్‌ను గృహ నిర్బంధం చేశారనే అనుమానం తనకు కలుగుతున్నదని చెప్పారు. హరీశ్‌రావు కాలనాగు కన్నా ప్రమాదకరమైన వ్యక్తి అని సీఎం మండిపడ్డారు. ‘బ్లాక్ కోబ్రా, హరీశ్ పక్కపక్కన ఉంటే...హరీశే డేంజర్ ’ అని అన్నారు. మంగళవారం నుంచి రెండు రోజుల పాటు కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సీఎం రేవంత్ చెప్పారు
ఎమ్మెల్యేలందరికీ సన్నబియ్యంతో భోజనం..
పేదలకు రేషన్ కింద సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆ క్రెడిట్ రేవంత్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలుకు ఏడాది పూర్తయిన సందర్భంగా.. సోమవారం అసెంబ్లీ లంచ్ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు, పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యంతో భోజనం పెట్టించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సన్న బియ్యం స్కీమ్‌తో రాష్ట్రంలోని పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన అని, ఇందుకోసం ఎంత భారమైనా భరిస్తామని, ఈ స్కీమ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల్లో కోత పెట్టబోమని స్పష్టం చేశారు. తెలంగాణలోని 86 శాతం జనాభాకు సన్న బియ్యం అందుతున్నాయని ఉత్తమ్ వివరించారు. సోనియా గాంధీ తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుకు తెలంగాణలో న్యాయం జరుగుతున్నదని చెప్పారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, అర్హులకే పెద్దపీట వేస్తున్నామని, ఇందులో రాజకీయాలకు తావు లేదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3 కోట్ల 39 లక్షల మంది సన్న బియ్యం లబ్ధిదారులు ఉన్నారని ఉత్తమ్ చెప్పారు.
బీజేపీ చెప్తున్నట్టు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల(17)కు 50 శాతం సీట్ల (8)ను కలిపితే 25కు చేరుతాయి. యూపీలోని 80 సీట్లకు 40 సీట్లను కలిపితే 120కి చేరుతాయి. గతంలో ఈ రెండు రాష్ట్రాల నడుమ సీట్ల తేడా 63 ఉండగా, ఇకపై 95 సీట్ల వ్యత్యాసం ఉంటుంది. ఇది ప్రమాదకరం. అలా కాకుండా ఆయా రాష్ట్రాల మధ్య సీట్లలో తేడా రాకుండా చూడాలి. అంటే కొత్తగా పెంచే సీట్లు అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా ఉండాలి.
సీఎం రేవంత్‌రెడ్డి
