
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మే 28వ తేదీ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. సోనియా గాంధీతో భేటీ అయ్యారు. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కావాలని ఆమెను ఆహ్వానించారు. ఆవిర్భావ వేడుకలకు తప్పకుండా వస్తానని సోనియా చెప్పినట్లు సీఎం తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక... తొలి రాష్ట్రావతరణ వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది సర్కార్.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్ కంపోజ్ చేయిస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్లను ఘనంగా సన్మానించాలని భావిస్తున్నారు. ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ వేడుకను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.