మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి: ప్రధాని నరేంద్ర మోదీని.. కోరిన సీఎం రేవంత్రెడ్డి

మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి: ప్రధాని నరేంద్ర మోదీని.. కోరిన సీఎం రేవంత్రెడ్డి
  • రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాలు చాలా ముఖ్యమని వెల్లడి
  • మెట్రో రైల్‌‌‌‌ ఫేజ్‌‌‌‌-2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించండి
  • ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌-బందర్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వేకు అనుమతివ్వండి
  • దాదాపు ఆరు కీలక అంశాలపై విజ్ఞప్తులు
  • నీతి ఆయోగ్ మీటింగ్​ తర్వాత ప్రధానితో ప్రత్యేక సమావేశం

న్యూఢిల్లీ, వెలుగు: గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని వివరించారు. రాష్ట్రానికి కీలకమైన దాదాపు ఆరు అంశాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ప్రధానిని కోరారు. నీతి ఆయోగ్ మీటింగ్​ అనంతరం ప్రధాని మోదీతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  

మెట్రో ఫేజ్–2 ప్రతిపాదనలు ఆమోదించండి

హైదరాబాద్‌‌‌‌ మెట్రో రైల్‌‌‌‌ ఫేజ్‌‌‌‌–2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని ప్రధానిని సీఎం రేవంత్​ కోరారు. ఏడు కారిడార్లకు సంబంధించి 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌‌‌‌ వెంచర్‌‌‌‌గా మంజూరు చేయాలని కోరారు. 

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ పనులకు ఆమోదం తెలపండి

హైదరాబాద్‌‌‌‌ రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం విజ్ఞప్తి చేశారు.  ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధానికి వివరించారు.  ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌లో దక్షిణ భాగం నిర్మాణం కీలకమని, చౌటుప్పల్‌‌‌‌ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్‌‌‌‌ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌‌‌‌ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. సౌత్​పార్ట్​ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ మ్యాపులు, హెచ్‌‌‌‌ఎండీఏ మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు.ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌‌ - బందర్‌‌ పోర్ట్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌వే తెలంగాణకు కీలకం

హైదరాబాద్‌‌– అమరావతి– బందర్‌‌ పోర్ట్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. హైదరాబాద్‌‌ నుంచి అమరావతి మీదుగా బందర్‌‌ పోర్టును కలిపే 12 లేన్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌వే తెలంగాణకు  అనేక రకాలుగా ఉపయోగపడుతుందని వివరించారు. 120 మీటర్ల రైట్‌‌ ఆఫ్‌‌ వేతో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్‌‌ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌‌, ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందని తెలిపారు.

కేంద్ర మంత్రి ఖట్టర్​తో సీఎం భేటీ

హైద‌‌రాబాద్ మెట్రో ఫేజ్‌‌-–2కు ఆమోదం తెల‌‌పాల‌‌ని కేంద్ర మంత్రి మ‌‌నోహ‌‌ర్ లాల్ ఖ‌‌ట్టర్​కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీ అనంతరం కృష్ణ మీనన్ మార్గ్ లోని కేంద్ర మంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో మెట్రో విస్తరణ, అనుమతులపై చర్చించారు. ప్రధానంగా ఆర్‌‌జీఐ ఎయిర్‌‌పోర్ట్‌‌ –భార‌‌త్ ఫ్యూచ‌‌ర్ సిటీ కారిడార్‌‌ను ఫేజ్ –3కింద చేప‌‌ట్టాల‌‌ని కేంద్ర మంత్రిని కోరారు.

ఐఐఎం ఏర్పాటు చేయండి

వరంగల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ పనుల అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తిచేసి ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగించామని వెల్లడించారు. వరంగల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు. 

వీటితోపాటు హైదరాబాద్‌‌‌‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్‌‌‌‌, టీఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయని, ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం–2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుందని ప్రస్తావించారు.